కులం కాదు… దేశమే ప్రధానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలు రాజకీయ మార్పుకు నాంది
జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను
విజయవాడ,ఆంధ్రప్రభ : విద్యాధరపురంలోని జనసేన పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని స్పష్టంగా చెబుతూ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని అన్నారు.
జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావన, దేశ సమగ్రత, శాంతి-సౌభాగ్యాలకు ప్రాధాన్యత వంటి అంశాలు బలమైన పునాదులుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, వివిధ సంఘటనలు దేశ ఐక్యత, సామాజిక సామరస్యాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయని అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ లౌకికవాద విలువలను ప్రపంచానికి చాటుతోందని తెలిపారు. దేశం పట్ల ప్రేమ పెరిగినప్పుడు సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ సందేశం యువతలో సానుకూల ఆలోచనలకు దారి తీస్తోందన్నారు.
నేటి రాజకీయాల్లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి కులాలు, మతాల పేరుతో విభజించే ధోరణి పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. “నేను ఏ ఒక్క కులం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం పనిచేసే విశ్వనరుడిగా ఉండాలనుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు.పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా జనసేన నాయకులు, జనసైనికులు పనిచేస్తూ రాజకీయాల్లో విలువలతో కూడిన మార్పును తీసుకురావడానికి కృషి చేస్తారని తెలిపారు. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారనే భావనతో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, విజయవాడ నగర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
