‘బస్తా లేదు… లారీ రాదు…’

‘బస్తా లేదు… లారీ రాదు…’
- మండుటెండలో వారం రోజులుగా పడిగాపులు
- రైతుల పక్షాన ఎర్రబెల్లి మహాధర్నా
రాయపర్తి, ఆంధ్రప్రభ : “బస్తాలు లేవు, లారీలు రావు… మండుటెండలో వారం రోజులుగా కళ్లాల కాడే పడిగాపులు కాస్తున్నాం. పండించిన పంటను కొనే నాథుడే లేడు” అంటూ మొక్కజొన్న రైతులు కన్నీటి పర్యంతమవుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చరవాణి ద్వారా తెలియజేశారు. దీంతో చలించిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఉదయం రాయపర్తి శివారులోని మక్కల కళ్లాల వద్దకు స్వయంగా వెళ్లి గుట్టలుగా పోసిన మొక్కజొన్న రాశులను పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.”సారూ… వారం నుంచి ఒక్క లారీ రాలేదు. బస్తాలు అడిగితే లేవంటున్నారు.
ఎండకు మక్కలు రంగు మారుతున్నాయి. వానొస్తే పూర్తిగా నష్టపోతాం” అంటూ రైతులు తమ ఆవేదన వెళ్లగక్కారు. వెంటనే స్పందించిన ఎర్రబెల్లి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి గోనె సంచులు, రవాణా వ్యవస్థ, స్టోరేజ్ సామర్థ్యం కోసం గోదాములు వెంటనే ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.అనంతరం రైతుల వినతి మేరకు రైతులతో కలిసి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ ముత్యం రాజేందర్ పోలీసు బృందంతో వచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమింపజేశారు.
అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండింది. కానీ సగం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ తెరిచిన పాపాన పోలేదు. తెరిచిన కేంద్రాల్లోనూ లారీలు లేవు, బస్తాలు లేవు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం” అని మండిపడ్డారు.”అధికారంలోకి రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేసి రైతులను మోసం చేశారు. నిన్నటి తీర్పుతోనైనా బుద్ధి తెచ్చుకొని సాగునీరు ఇవ్వాలి. పంట పండించిన తర్వాత కనీసం కొనే దిక్కు కూడా లేకుండా చేశారు” అని విమర్శించారు.
“ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ప్రతి పంటకు బోనస్ అని ఊదరగొట్టారు. ఇప్పుడు ఆ మాటను పూర్తిగా బోగస్ చేశారు. ఈ ప్రభుత్వం కరెంటు ఇవ్వదు, రైతుబంధు వేయదు, బోనస్ ఇవ్వదు, పండిన పంటకు మద్దతు ధరకు కొనదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం” అని ధ్వజమెత్తారు.”ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి యుద్ధ ప్రాతిపదికన అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి లారీలు, బస్తాలు సమకూర్చి క్వింటాకు రూ.2400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం” అని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
