దేవాలయాలకు రాజకీయ రంగు పులమొద్దు..
దేవాలయాలకు రాజకీయ రంగు పులమొద్దు..
- స్వామికి నేను సేవకురాలిని మాత్రమే
- తాము ఎప్పుడూ విచక్షణారహితంగా ప్రవర్తించలేదు
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : దేవాలయాలపై రాజకీయాలు చేయడం తగదని, దేవుళ్లపై రాజకీయం చేసే వారికి పుట్టగతులు ఉండవని వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత పట్టణ అభివృద్ధి వేగంగా సాగుతున్న సమయంలో 2022లో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంకల్పంతో మంజూర్‌నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టామని తెలిపారు. తిరుపతికి వెళ్లలేని భక్తులకు కలియుగ దైవం దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ప్రజల సహకారం కోరామని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్మాణం పూర్తవ్వాలని తాను 23 నెలల పాటు ఉడికిన ఆహారం కూడా తీసుకోకుండా దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. కేవలం 14 నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసి స్వామివారి ప్రతిష్ఠాపన నిర్వహించామని తెలిపారు.
ఆలయ నిర్మాణం అనంతరం మొక్కు తీర్చుకునేందుకు భూపాలపల్లి నుంచి తిరుపతివరకు పాదయాత్ర చేసినట్లు చెప్పారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచినవారు ఆలయంపై రాజకీయాలు ప్రారంభించారని ఆరోపించారు. ఆలయానికి సంబంధించి హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భక్తుల విరాళాల్లో ఒక్క రూపాయి కూడా తాము ముట్టలేదని, కాంగ్రెస్ నాయకుడు అనిల్‌ను శాశ్వత ధర్మకర్తగా నియమించామని తెలిపారు.
అనైతికంగా ఆలయ కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ, దానికి నిరసన తెలిపేందుకే ఆలయానికి వెళ్లామని స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ విచక్షణారహితంగా ప్రవర్తించలేదని, ఆలయం మాదని కూడా ఎప్పుడూ చెప్పలేదన్నారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆలయం వద్ద జరిగిన ఘటన బాధాకరమని, మహిళా నాయకురాలిననే కనీస గౌరవం కూడా లేకుండా తీవ్రవాదిలా బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్నారని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆమె, పెత్తనం కాదు.. స్వామికి నేను సేవకురాలిని మాత్రమే అని పేర్కొన్నారు. తాము తప్పు చేసి ఉంటే భగవంతుడి శిక్షకు సిద్ధమని అన్నారు. ఆలయాలకు రాజకీయ రంగు పులమొద్దని, అనేక దేవాలయాలు దూపదీప నైవేద్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలతో మరో తిరుపతిని తలపించేలా అభివృద్ధి చెందిన ఆలయంపై కుట్రలు చేయడం బాధాకరమన్నారు. దేవుని సాక్షిగా జరిగిన ఈ ఘటనకు దైవమే సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, యువ నాయకులు, మహిళా నాయకులు, గండ్ర దంపతుల అభిమానులు పాల్గొన్నారు.
