నరసాపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్ల
ప్రయాణికుల డిమాండ్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్
తిరువణ్ణామలై, బెంగళూరు మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులు
జూలై తొలి వారంనుంచి పరుగులు
విజయవాడ మీదుగా కీలక స్టేషన్లకు మెరుగైన అనుసంధానం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రయాణికుల నుంచి కొనసాగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నరసాపురం నుంచి నడుస్తున్న రెండు ‘ట్రైన్స్ ఆన్ డిమాండ్’ ప్రత్యేక రైళ్లను శాశ్వత సర్వీసులుగా కొనసాగించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. నరసాపురం–తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్, నరసాపురం–ఎస్ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు జూలై నుంచి రెగ్యులర్ రైళ్లుగా నడవనున్నాయి. దక్షిణ తీర రైల్వే విజయవాడ డివిజన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నరసాపురం–తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్ (17291) ప్రతి బుధవారం జూలై 1 నుంచి, తిరుగు ప్రయాణ రైలు (17292) ప్రతి గురువారం జూలై 2 నుంచి రెగ్యులర్ సర్వీసుగా నడుస్తుంది.
అలాగే నరసాపురం–ఎస్ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (17293) ప్రతి శుక్రవారం జూలై 3 నుంచి, తిరుగు సర్వీసు (17294) ప్రతి శనివారం జూలై 4 నుంచి శాశ్వత రైలుగా అందుబాటులోకి రానుంది. నరసాపురం–తిరువణ్ణామలై రైలు పాలకొల్లు, భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కాంట్ వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్–తమిళనాడు మధ్య ప్రయాణించే భక్తులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు మరింత సౌలభ్యం కలగనుంది.
అలాగే నరసాపురం–ఎస్ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరుకు చేరుతుంది. ఈ సర్వీసు ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ప్రయాణికులకు బెంగళూరుతో నేరుగా మెరుగైన రైలు అనుసంధానం లభించనుంది. రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రత్యేక రైళ్ల కొనసాగింపుపై ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని శాశ్వత హోదా కల్పించడం రైల్వే శాఖ ప్రయాణికుల సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
