మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు గ్రీన్ సిగ్నల్
సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు
ఎర్రవల్లి, ఆంధ్రప్రభ: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలోని మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డా. ఎస్.ఏ. సంపత్ కుమార్ మాట్లాడుతూ, అలంపూర్‌కు ఆర్డీఎస్ నీరు, తుమ్మిళ్ల లిఫ్ట్, రిజర్వాయర్ల నిర్మాణం కోసం తాను చేసిన కృషికి ఫలితం దక్కిందన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ఫైల్ సిద్ధమైందని, రైతులతో చర్చించి భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఫోన్‌లో సూచించినట్లు తెలిపారు. దీంతో తనతో పాటు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏనముల నాగరాజు, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్. రెడ్డి, రాజోలి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దస్తగిరి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ విషయంలో రైతులకు తగిన పరిహారం అందిస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.
అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
