అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయడమే లక్ష్యం

  • సర్పంచ్ ఎంఏ సమీర్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామ పంచాయతీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ ఎంఏ సమీర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీకి వచ్చిన ఓటర్ల ఎస్‌ఐఆర్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించి వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల్లో నమోదు చేస్తున్నామని, ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఓటరు జాబితా ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్యూమరేషన్ సిబ్బంది ప్రజల వివరాలను పరిశీలించి నమోదు చేస్తున్నారని, ప్రజలు అవసరమైన పత్రాలతో సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, కారోబార్ ఇమ్రాన్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్యూమరేషన్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.