సంజూ శాంసన్‌కు ‘రెస్ట్’ వెనుక అసలు కారణమిదే!
ఆంధ్రప్రభ, స్పోర్ట్స్ డెస్క్ : జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) అధికారికంగా ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు ఈ జట్టులో లేకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన సంజూ.. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అదే సమయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడం కూడా ఒక కారణంగా భావిస్తూ.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అందుకే పక్కన పెట్టాం.. సెలెక్టర్ల క్లారిటీ!
సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు సెలెక్టర్ల నుంచి సమాధానం లభించింది. శాంసన్‌ను పక్కన పెట్టడం వెనుక ఎలాంటి వివాదం లేదని, అది కేవలం విశ్రాంతి (Rest) మాత్రమేనని సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ పర్యటనకు ఇద్దరు సీనియర్ వికెట్ కీపర్లను ఒకేసారి తీసుకెళ్లడం సెలెక్షన్ కమిటీకి ఇష్టం లేదని వెల్లడించారు. టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లు యువ వికెట్ కీపర్లకు అవకాశం ఇవ్వాలని భావించడంతో పాటు, సీనియర్లకు వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడంలో భాగంగానే సంజూకు ఈ సిరీస్ నుండి విశ్రాంతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రభ్సిమ్రాన్ సింగ్‌కు తొలిసారి పిలుపు.. కొత్త ముఖాలు ఇవే!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్ రేట్‌తో 510 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్‌కు వికెట్ కీపర్ బ్యాటర్‌గా సెలెక్టర్లు తొలిసారి సీనియర్ జట్టు నుండి అవకాశం ఇచ్చారు. గాయాలు, ఇతర కారణాలతో గతంలో దూరమైన స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, పేస్ గన్ మయాంక్ యాదవ్‌లు తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. దేశీవాళీ క్రికెట్, ఐపీఎల్లో రాణించిన హర్ష్ దూబే, యష్ ఠాకూర్, అశోక్ శర్మలకు జట్టులో చోటు దక్కింది. తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
