మత్స్యకారుల కోసం సెర్చ్ ఆపరేషన్ పొడిగింపు..
- రేపు మధ్యాహ్నం వరకు కోస్ట్‌గార్డ్ రెస్క్యూ!
ఆంధ్రప్రభ, విశాఖపట్నం : విశాఖపట్నం తీరంలో జరిగిన మత్స్యకారుల పడవ ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను తాత్కాలికంగా ముగించినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ, బాధిత కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్‌ను పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపు
కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సముద్రంలో శోధన కాలపరిమితిని (సెర్చ్ టైం లిమిట్) పొడిగించారు. ఇందులో భాగంగా బుధవారం (రేపు) మధ్యాహ్నం 12 గంటల వరకు కోస్ట్‌గార్డ్ (భారత తీరరక్షక దళం) తన సహాయక చర్యలను సముద్రంలో ముమ్మరంగా కొనసాగించనుంది.
అసలేం జరిగిందంటే..?
విశాఖ చేపల రేవు నుంచి మొత్తం ఏడుగురు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని శనివారం తిరిగి వస్తున్న సమయంలో సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వారి బోటు అనుకోకుండా తిరగబడింది. బోటులో ఉన్న వారంతా ఒక్కసారిగా నీటిలో పడిపోగా.. వారిలో ఒక మత్స్యకారుడు మాత్రం ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే మిగిలిన ఆరుగురు సముద్రంలో గల్లంతయ్యారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారుల సహకారంతో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బోట్లు, ఆధునిక నావిగేషన్ పరికరాలు, సముద్ర గాలింపు సాంకేతికతను ఉపయోగించి ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు సమీప సముద్ర జలాల్లో దాదాపు మూడు రోజుల పాటు నిరంతరంగా శోధించారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో మొదట సెర్చ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా ముగించారు.
ప్రస్తుతం కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో రెస్క్యూ ఆపరేషన్‌ను పొడిగించడంతో.. తమ వారు ఎలాగైనా క్షేమంగా దొరకకపోతారా అని బాధిత కుటుంబాలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాయి.
