భీమ్‌గల్ లో ట్రాక్టర్ టెర్రర్..

భీమ్‌గల్ లో ట్రాక్టర్ టెర్రర్..

అనుకోకుండా అడ్డు వస్తే అంతే సంగతి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : ఇసుక వాహనాల వేగానికి బ్రేకులు లేకుండా పోతున్నాయి. ట్రాక్టర్ ల స్పీడ్ కు సామాన్యులు బలి అయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు జరుగక ముందే అధికారులు స్పందించక పొతే ఘోర మైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో బడా భీంగల్, ముచ్కూర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన కూలి చనిపోవడం జరిగింది. ముచ్కూర్ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్ స్పీడ్ టెర్రర్ ను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.

ఇసుక అనుమతి ఉన్న రోజు భయంకరం..

ప్రభుత్వం ఇసుక తీసుకునేందుకు పట్టణంలో మన ఇసుక.. మన వాహనం ద్వారా వీక్లీ వన్స్ పర్మిషన్ ఇస్తోంది. ఇట్టి పర్మిషన్ ద్వారా వినియోగదారులకు ఇసుక ను ట్రాక్టర్ ల ద్వారా నిర్మాణం ఉన్న పాయింట్ వద్దకు చేర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్లు పోటీ పడి మరి ట్రాక్టర్లను ఓవర్ స్పీడ్ తో ఇసుక తరలిస్తున్నారు. బండెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అన్నట్టు ఒకదాని వెంట ఒకటి పోటీ పడి మరి ఓవర్ స్పీడ్ తో ప్రజల్లో భయం పుట్టిస్తున్నారు. వీరు స్పీడ్ ను కంట్రోల్ చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుకోకుండా ఎవరైనా ఆ సమయంలో అడ్డు వస్తే బొక్కలు కూడ మిగిలే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

మొత్తం 50 ట్రాక్టర్లు..

ఇసుక తరలించేందుకు సుమారు పట్టణంలో సుమారు 50 ట్రాక్టర్లు పోటీ పడుతున్నాయి. ఇందులో దాదాపు వ్యవసాయ పనుల కోసం అనుమతులు తీసుకున్నవే. వ్యవసాయ పనులకు అనుమతులు తీసుకొని కమర్షియల్ వినియోగించడం చట్టరీత్యా నేరం అవుతుంది. కాని వీటిని అరికట్టాల్సిన ఆర్టీవో అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి .

లైసెన్స్ లేకుండా మైనర్ డ్రైవర్లే అధికం..

ఇసుక ట్రాక్టర్లు నడిపే డ్రైవర్ల కు ఎక్కువ శాతం డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదు. ఇది కాకుండా మైనర్లు కూడ ట్రాక్టర్ డ్రైవర్లుగా మారుతున్నారు. నిత్యం వాహనాల తనిఖీ పేరిట తనిఖీ లు చేపడుతున్న పోలీసులకు గాని, ఆర్టీవో అధికారులకు గాని పట్టింపు లేక పోవడం తోనే పరిస్థితి ఇలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నియంత్రణ లేకుంటే మరిన్ని ప్రమాదాలు..

కమర్షియల్ అనుమతి లేకుండా ట్రాక్టర్లు నడుపుతున్న వారిని నియంత్రణ చేయడం, లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ లు నడుపుతున్న వారిని, మైనర్ డ్రైవర్లకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply