TIRUPATHI | కల్పవృక్ష వాహనంపై సిరులతల్లి

మురళీకృష్ణ అలంకారంలో పద్మావతి అమ్మవారు దర్శనం
TIRUPATHI |తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ, చిరుజల్లుల మధ్య వాహనసేవ కోలాహలంగా జరిగింది.

కల్పవృక్ష వాహనం.. ఐహిక ఫల ప్రాప్తి
పాలకడలిని అమృతం కోసం మధించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వ జన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలిమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి.వీరబ్రహ్మం, సీవీఎస్వో కేవీ.మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




