Tirumala19thjune26 | శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24గంట‌లు

Tirumala19thjune26 | శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24గంట‌లు

తిరుమలలో శిలాతోరణం వరకూ క్యూ

Tirumala19thjune26 |తిరుమల, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వారాంతం ప్రారంభం కావడంతో శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి తిరుమల క్షేత్రం కిక్కిరిసిపోయింది. ముందస్తు అంచనాల మేరకు శుక్రవారం నుంచి సోమవారం వరకు భారీ రద్దీ ఉండే అవకాశాన్ని గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

శిలాతోరణం వరకూ విస్తరించిన క్యూ లైన్
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించింది. టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూలో ప్రవేశిస్తున్న భక్తులకు శ్రీవారి దర్శనం పొందేందుకు దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

గురువారం భారీగా భక్తుల రాక
టీటీడీ గణాంకాల ప్రకారం గురువారం ఒక్కరోజే 72,703 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 37,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు నమోదు కావడం విశేషం. భక్తులకు అందించే ప్రసాదాల్లో భాగంగా గురువారం 4.34 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.42 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

అన్నప్రసాద నాణ్యతపై టీటీడీ ప్రత్యేక దృష్టి
భక్తులకు అందించే అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో పప్పు మిల్లర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పప్పు మిల్లర్లతో సమావేశమైన ఆయన, అన్నప్రసాదాల తయారీలో వినియోగించే పప్పు దినుసుల నాణ్యత, సరఫరా, నిల్వలు, భవిష్యత్ అవసరాలపై చర్చించారు.

రోజూ ఏడు రకాల పప్పు దినుసుల వినియోగం
టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద పథకంలో ప్రతిరోజూ పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారు. శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగలు సహా మొత్తం ఏడు రకాల పప్పు దినుసులను అన్నప్రసాద తయారీలో ఉపయోగిస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు.

భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, వసతి, అన్నప్రసాదం, లడ్డూ పంపిణీ తదితర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు టీటీడీ కృషి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. వారాంతంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భక్తులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.