త్రోబాల్ పోటీల్లో ఉరుమడ్ల మహిళల సత్తా
జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం.. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
చిట్యాల ఆంధ్రప్రభ : ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామోత్సవంలో భాగంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాలలో జిల్లా స్థాయి మహిళా త్రోబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మహిళల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచి రెండో బహుమతిని కైవసం చేసుకుంది.
విజేతగా నిలిచిన ఉరుమడ్ల మహిళా క్రీడాకారులు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఆమె మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన క్రీడాకారులు తమ ప్రతిభతో ఉరుమడ్ల గ్రామానికి జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందిస్తాయని, క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత అవకాశాలను సొంతం చేసుకోవచ్చని తెలిపారు.
క్రీడాకారులకు సొంత ఖర్చులతో జెర్సీలను అందజేస్తామని సర్పంచ్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు, వార్డు సభ్యులు గంగాపురం రాము, వెలిమినేటి హరిప్రసాద్, మెడబోయిన స్వాతి శ్రీను, బోయ సుష్మిత, మహిళా క్రీడాకారులు మాధగోని నాగమణి, కోరబోయిన పుష్పలత, మర్రి కల్పన, సాగర్ల వైష్ణవి, ఈర్ల నవ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
