మెనూ ప్రకారం భోజనం పెట్టాలని డిమాండ్

బీసీ వసతిగృహ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థుల ధర్నా

బెల్లంపల్లి ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీసీ వసతిగృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్ మాట్లాడుతూ.. వసతిగృహంలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆరోపించారు. విద్యార్థులు క్రీడలు ఆడుకునేందుకు గ్రౌండ్‌కు వెళ్లేందుకు వార్డెన్ అనుమతించడం లేదని తెలిపారు. విద్యార్థులను జైలులో ఉంచినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.

హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మనోజ్‌ను కోరారు. అనంతరం ఆయనకు వినతిపత్రం అందజేశారు.

వసతిగృహంలో సమస్యలను పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.