ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి – కలెక్టర్ కె.వెట్రిసెల్వి

  • 334 అర్జీలు స్వీకరించిన జిల్లా యంత్రాంగం
  • పీజీఆర్ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల వినతులు
  • ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధకు కలెక్టర్ ఆదేశం

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా కలెక్టరేట్‌ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్‌ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్. దేవకీ దేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్నలు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు నుండి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోపుగా పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీదారులకు సంతృప్తి స్థాయి మరింత పెంచేలా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులుపై ఉందని స్పష్టం చేశారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని అన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చక్కని పరిష్కారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని..

  • భీమడోలు మండలం గుండుగోలనుకు చెందిన ఉయ్యూరు నాగరాజు నాకు అన్నదాత సుఖీభవ సాయం జమ కాలేదని, జమఅయ్యేలా చూడాలని కోరారు.
  • ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన పేరూరి చంద్రశేఖర్ నా స్థలం ఆక్రమణకు గురైందని, రహదారి లేకుండాచేశారని విచారణ చేసి పరిష్కారం చూపాలని కోరారు.
  • దెందులూరు మండలం గోపన్నపాలెం చెందిన వి.ధర్మారావు గ్రామపంచాయతీకి డంపింగు పనులు చేసానని, చాలా కాలం అయ్యిందని బిల్లులు చెల్లించాలని కోరారు.
  • టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన వట్టి రాధాకృష్ణ అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి టిటిడి నుండి నిధులు మంజూరు చేయించాలని కోరారు.
  • పెదవేగి మండలం పెదకడిమి గ్రామానికి చెందిన చల్లగొల్ల వెంకటరావు మా గ్రామంలో పశువులు చెరువుకు నీటికొరత లేకుండా చూడాలని, పాడి, పశువులు ఉన్న చాలామంది రైతులు ఉన్నారని తెలిపారు.