తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి
విత్తన మేళాలో ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ అధికారుల అవగాహన
జుక్కల్/కామారెడ్డి ఆంధ్రప్రభ : తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ ఏఈఓలు పండరి, శ్రీలేఖ, రూపా, నాందేవ్, సతీష్, ప్రవీణ్, షోహెబ్ సూచించారు.
జుక్కల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓలు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు సాగు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల యాజమాన్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలపై వివరించారు.
ఈ విత్తన మేళాలో కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలతో పాటు వివిధ రకాల విత్తనాలను ప్రదర్శించారు. వాటి వినియోగం, సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
రైతులు తమ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని సూచించారు. అనంతరం రైతులతో ప్రత్యక్షంగా చర్చించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్‌తో పాటు ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
