ఎస్‌ఐఆర్‌ నమోదులో పరకాల రెవెన్యూ డివిజన్‌కు ద్వితీయ స్థానం

పరకాల ఆర్డీవో డి.ఎస్. వెంకన్నకు అధికారుల అభినందనలు

పరకాల ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్‌) లో పరకాల రెవెన్యూ డివిజన్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుధర్శన్ రెడ్డి పరకాల ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ), రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్నకు ఫోన్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని సీఈఓ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆర్డీవో, ఈఆర్‌ఓ డి.ఎస్. వెంకన్న మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించడంలో సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌ఓలు), తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, బూత్ స్థాయి సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు), ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి ఉందన్నారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన ఎన్నికల సేవలు అందించేందుకు అదే నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు.