రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు కల్పించాలి

పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా ఎంపీలు కృషి చేయాలి: కాంగ్రెస్ నాయకులు

చెన్నూర్, ఆంధ్రప్రభ : అటవీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారుల పనులకు అనుమతులు కల్పించేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే విధంగా ఎంపీలు కృషి చేయాలని చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.

సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో కోటపెల్లి మాజీ జడ్పీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోటు రాంరెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా మారుమూల అటవీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సరైన సంబంధాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాత అటవీ సంరక్షణ చట్టాల కారణంగా అనుమతులు లభించక అనేక గ్రామీణ రహదారి ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. తరతరాలుగా వినియోగంలో ఉన్న బండిదారుల అభివృద్ధికి సైతం విధానపరమైన అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు.

ప్రజలకు రహదారి సౌకర్యాలు కల్పించిన అధికారులపై శిక్షాత్మక చర్యలు తీసుకోవడం పరిపాలనా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అటవీ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేలా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంటులో తమ గళం వినిపించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలు మెరుగుపరిచేందుకు అటవీ చట్టాలను సవరించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ రాజమల్ల గౌడ్, కోటపెల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.