కుటుంబ తగాదాలతో..
కుటుంబ తగాదాలతో..
- కత్తులతో దాడి..
- ముగ్గురికి తీవ్ర గాయాలు
గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై కత్తితో దాడి జరగడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక వన్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం ఈ దాడికి కారణమైంది. రామ్ దూత్ అనే యువకుడు తన సొంత బంధువులు అయిన ప్రణయ్, సుమిత్ర, కొమురమ్మలపై కొబ్బరికాయలు కొట్టే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కండేయ కాలనీలో నివసిస్తున్న ప్రణయ్ కుటుంబ పోషణ కోసం ఇంటి ముందర చిన్న షాపు ఏర్పాటు చేసి సిగరెట్లు విక్రయిస్తున్నాడు.
షాపు వద్దే వినియోగదారులు సిగరెట్లు తాగడం వల్ల వచ్చే పొగ వాసనపై రామ్ దూత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ షాపు మూసివేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతకాలంగా ఇరువురి మధ్య వివాదం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం తీవ్ర ఆగ్రహంతో రామ్ దూత్ ప్రణయ్ ఇంటిలోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన ప్రణయ్ పిన్ని సుమిత్ర, అమ్మమ్మ కొమురమ్మలపై కూడా దాడి చేయడంతో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. బలమైన కత్తిపోట్ల కారణంగా ప్రణయ్ పరిస్థితి విషమంగా మారింది. మొదట బాధితులను స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, ప్రణయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
