ACCIDENT | ఇదీ ప్ర‌మాద‌క‌రం!

ACCIDENT | ఇదీ ప్ర‌మాద‌క‌రం!

రైతుల‌కు క‌ల్లాలు లేక‌.. ర‌హ‌దారుల‌పై ధాన్యం ఆరబోత

ప్రమాదాల బారిన వాహనదారులు

ACCIDENT | మక్తల్ , ఆంధ్ర‌ప్ర‌భ : అది 167వ జాతీయ ర‌హ‌దారి.. నిత్యం వాహ‌నాల‌తో ర‌ద్దీగా ఉంటుంది.. ద్విచ‌క్ర వాహ‌నాలు (Two-wheelers) కూడా తిరుగుతుంటాయి.. అలాంటి ర‌హ‌దారిపై రైతులు ధాన్యం ఆరబోస్తున్నారు! ఇలా ధాన్యం ఆరబోయ‌డం..! కుప్ప‌లుగా పెట్ట‌డంతో వాహ‌నాలు ప్ర‌మాదానికి గుర‌వుతున్నాయి. ఇదీ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని రైతులు ఒక్క‌సారి ఆలోచించాల‌ని ప‌లువురు వాహ‌న‌దారులు కోరుతున్నారు.

జాతీయ రహదారిపై రైతులు ధాన్యం ఆర బోస్తుండటంతో ప్రమాదాలు (Accidents) జరిగే అవకాశం ఉంది. రోడ్లపై రోజంతా ధాన్యం ఆరబోస్తూ రాత్రి సమయంలో అక్కడే కుప్పలు కట్టి ఉంచుతున్నారు. దీంతో వాహనచోదకులకు ఇబ్బందిగా మారింది. రైతులు ఇష్టం వచ్చినట్లు జాతీయ రహదారిపైనే కాకుండా గ్రామాలకు వెళ్లె రోడ్లపై కూడా ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలకు కారణం అవుతోంది.

నారాయణపేట‌ జిల్లా మక్తల్ పరిధిలోని (Maktal area of ​​Narayanpet district) జాతీయ రహదారి 167 పై మక్తల్ మండల పరిధిలోని కాచ్ వార్ , జక్లేర్, గుడిగండ్ల గ్రామాల వద్ద రోడ్డుపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. అదేవిధంగా మాదన్ పల్లి, నర్వ, యాంకి, నాగిరెడ్డిపల్లి, కడుమూరు తదితర గ్రామాల వద్ద కూడా రోడ్డుపై కూడా రైతులు ధాన్యం ఆర‌బోస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యులు ఎవరవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

జాతీయ రహదారి పై నిత్యం సుదూర‌ ప్రాంతాలకు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయో. ఈ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టంగా ఉంటుంది. అయినా జాతీయ రహదారి అధికారులు అదేవిధంగా ఆర్ అండ్ బి , పంచాయతీ రాజ్ (Panchayat Raj) అధికారులు నిమ్మకునీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోతలను నివారించి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ధాన్యం ఆరబోసుకునేందుకు కల్లాలు ఏర్పాటు లేకపోవడం వల్లే తప్పని పరిస్థితిలో తమ గ్రామాల్లో ఉన్న రోడ్డుపై ఆరబోస్తున్నామని రైతులు అంటున్నారు. తాము ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వస్తుందని అంటున్నారు . ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ రైతులకు కల్లాలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply