హైదరాబాద్ – జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు అసువులు బాశారు. ఈ దాడిని ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. జమ్ము కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ సచివాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇదిఇలాఉంటే ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ(గురువారం) సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు.