భక్తులను దుర్భాషలాడారన్న ఆరోపణలతో రాస్తారోకో

నర్సంపేట, ఆంధ్రప్రభ : హనుమాన్ భక్తులను దుర్భాషలాడారన్న ఆరోపణలతో భక్తులు రాస్తారోకో చేపట్టిన ఘటన నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… మహేశ్వరం గ్రామంలోని ఆలయ ప్రాంతంలో హనుమాన్ భక్తులు మాలలు ధరించి పూజలు నిర్వహిస్తూ విడిది చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు గుజ్జుల మాధవరెడ్డి చెప్పులు, బూట్లతో ఆలయ పరిసరాల్లో నడవడంతో భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై ఆగ్రహానికి గురైన మాధవరెడ్డి భక్తులను దుర్భాషలాడారని వారు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన భక్తులు నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ కారణంగా సుమారు ఒక కిలోమీటర్ మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో భక్తులు ఆందోళన విరమించారు. అనంతరం హనుమాన్ భక్తులు గుజ్జుల మాధవరెడ్డిపై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
