నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు: ఎమ్మెల్యే
చిట్యాల, (ఆంధ్రప్రభ): ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుపేదలకు పారదర్శకంగా సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (జీఎస్ఆర్) స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి (సి) గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన రెండు ఇందిరమ్మ గృహాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది లబ్ధిదారులకు గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.
భూపాలపల్లి నియోజకవర్గానికి మొదటి విడతలో 1500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారులు వీటిని త్వరితగతిన పూర్తి చేసుకుంటే రెండో విడతలో మరికొంతమంది నిరుపేదలకు అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఎలాంటి దళారుల ప్రమేయం, అవినీతికి తావు లేకుండా అర్హులైన కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తామని, ప్రభుత్వం అందించే రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, స్థానిక సర్పంచ్ తౌటం లక్ష్మి, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, దొడ్డి కిష్టయ్య, చిలుకల రాయకోమురు, గంగాధరి రవీందర్, కట్కూరి నరేందర్, బుర్ర శ్రీనివాస్, అల్లకొండ కుమార్, దబ్బెట అనిల్ అల్లంరాజు, సర్పంచులు కొడారి అశోక్, నక్క భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
