ఊరలక్ష్మమ్మ దేవాలయం వద్ద దొంగతనాలు అరికట్టాలి

  • ఎస్సైకు ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు

ఊట్కూర్, ఆంధ్రప్రభ:నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ వీధిలో ఉన్న ఊరలక్ష్మమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఊట్కూర్ ఎస్సై రమేష్‌కు ఫిర్యాదు చేశారు.దేవాలయం వద్ద ఉన్న బోరు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వైరు దొంగిలించారని వారు పేర్కొన్నారు. గతంలో కూడా దేవాలయ హుండీతో పాటు పలు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తు చేశారు.

దేవాలయం వద్ద నిఘా పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్సై రమేష్, దేవాలయం వద్ద భద్రతను పెంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో జరిగిన చోరీ ఘటనలపై కూడా దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.ఆలయ కమిటీ సభ్యులు సహకరిస్తే దేవాలయం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఎస్సై హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బోయిని రమేష్, భక్తులు శివరాజ్ రెడ్డి, నరసింహ, తరుణ్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, ఉదయ్ కుమార్, మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.