పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ఫైర్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ “పోరుబాట” పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతోనే మొద్దు నిద్రలేచి ప్రాజెక్టులపై మంగళవారం సమీక్ష చేశారని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు.
ఈ మేరకు మర్రి జనార్దన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో వివిధ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేళ్ల సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని, కాలువల టెండర్లను రద్దు చేయడం, రెండున్నరేళ్లుగా తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని విమర్శించారు.
“పాలమూరు బిడ్డ” అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష చేయలేదని, కేసీఆర్పై కక్షతో రైతులను మోసం చేయవద్దని, పాలమూరుకు అన్యాయం చేయవద్దని సూచించారు.
ఇప్పటికే పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది నార్లాపూర్తో పాటు ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లలో దాదాపు 45 టీఎంసీల వరకు నీటిని నింపుకునే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.
రెండున్నరేళ్లుగా ప్రాజెక్టు పనులను నిలిపివేయడంపై త్వరలో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేపట్టాలని ఈ నెల 15న మహబూబ్నగర్లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యాచరణ ప్రకటించారని తెలిపారు. పాదయాత్ర ముగింపు సభకు కే చంద్రశేఖర్ రావు ను తీసుకురావాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.
రైతులు, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో ప్రతిఘటన తప్పదనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష నిర్వహించారని పేర్కొన్నారు.
అయితే ఈ సమీక్ష మొక్కుబడిగా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పాడైన రెండు మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి మొత్తం ఐదు మోటార్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నార్లాపూర్-ఏదుల-వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేసి ఈ ఏడాదే నీటిని ఎత్తిపోసుకుని రిజర్వాయర్లు నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ “పోరుబాట” నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, అయినా పనులు ప్రారంభించే వరకు బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు.
