మందోళ్లగూడెంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

విజన్ కంపెనీ సహకారం అభినందనీయం..

గ్రామాభివృద్ధికి అండగా నిలిచిందన్న సర్పంచ్ వెంకటేష్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సింగరాయచెరువు (సప్పిడోళ్లగూడెం) గ్రామంలో సోమవారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని స్మశానవాటికలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ రోడ్డు నిర్మాణానికి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించిన విజన్ (Vision) కంపెనీ యాజమాన్యానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా గ్రామాభివృద్ధికి సంస్థ అందించిన సహకారం అభినందనీయమని గ్రామ సర్పంచ్ తంగేళ్ల వెంకటేష్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రజల సహకారంతో పాటు సంస్థల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుర్కంటి శ్రీధర్‌రెడ్డి, వార్డు సభ్యులు యాట వెంకటేష్, చప్పిడి హంసమ్మ, మానే రవికుమార్, గుండు శ్రీశైలం, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.