focus5states | జనాగ్రహ సభకు బీజేపీ రెడీ
focus5states | జనాగ్రహ సభకు బీజేపీ రెడీ
focus5states | ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత ఫోకస్
ప్రధాని మోదీతో భారీ సభకు బీజేపీ యత్నాలు
బెంగాల్లో గెలిస్తే తెలంగాణపై దృష్టి
అధికార కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే వ్యూహం
కేసీఆర్ మార్క్ రాజకీయాలను అడ్డుకునే పన్నాగం
మండుటెండల్లో మొదలైన పొలిటికల్ హీట్
focus5states | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సానుకూల ఫలితాలను ఆశిస్తోంది. ఈ ఫలితాలు వెలువడిన వారం రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దించి.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాలని అధిష్టానం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జనాగ్రహ సభను కూడా ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజల అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ భావిస్తోంది.

బెంగాల్లో గెలిస్తే ఆగరు..
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలపై బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. ఒకవేళ బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగిరితే, ఆ ఉత్సాహం తెలంగాణ బీజేపీ నేతల్లో రెట్టింపు కానుంది. బెంగాల్ విజయం ఇక్కడి కేడర్‌లో కొత్త రక్తం నింపుతుందని, ఆ ఊపుతోనే మిషన్ తెలంగాణను వేగవంతం చేయవచ్చని అమిత్ షా వంటి అగ్రనేతలు భావిస్తున్నారు. బెంగాల్ వంటి బలమైన ప్రాంతీయ శక్తి ఉన్న రాష్ట్రంలోనే గెలవగలిగితే, తెలంగాణలో కేసీఆర్ మార్కు రాజకీయాలను ఎదుర్కోవడం కష్టం కాదనే సంకేతాలను మోదీ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
జనాగ్రహసభకు భారీగా జన సమీకరణ
ప్రధాని మోదీ నిర్వహించబోయే జనాగ్రహ సభ కేవలం ఒక సాధారణ బహిరంగ సభ మాత్రమే కాదు. కాంగ్రెస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం, బీఆర్ఎస్లో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలను తమ వైపు తిప్పుకోవడానికి ఇదొక వేదిక కానుందని తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనే అనే బలమైన ముద్రను వేయడానికి మోదీ ఈ వేదికపై నుంచి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా అటు అధికార పక్షమైన కాంగ్రెస్‌ను.. ఇటు బీఆర్ఎస్ పార్టీని ఏకకాలంలో ఇరకాటంలోకి నెట్టాలన్నది కాషాయ వ్యూహం. తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఈ పర్యటనపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మోదీ రాకతో రాష్ట్రవ్యాప్తంగా భారీ చేరికలకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు బీజేపీలో చేరడానికి మోదీ సభ ఒక ముహూర్తంగా మారుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గేరు మార్చుతున్న బీజేపీ
బెంగాల్ ఫలితాలు అనుకూలంగా వస్తే, తెలంగాణలో బీజేపీ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేయడం ఎవరికీ సాధ్యం కాదన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ తన రెండో గేరును మార్చి వేగంగా ముందుకు దూసుకెళ్లడానికి సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల ఫలితాలు ఇచ్చే బూస్ట్‌తో మోదీ జనాగ్రహం ద్వారా తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మార్చేయాలని చూస్తోంది. ఈ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారుతాయా? లేదా అన్నది ఈనెల మొదటి వారంలో తేలనుంది.
CLICK HERE TO READ MORE గవర్నర్‌ను కలిసిన వెదిరె మేఘా రెడ్డి
