హైదరాబాద్ : ఎండిన వరి పంటతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అంటూ నినాదాలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందాల పోటీలా అంటూ నినదించారు. ఆ తర్వాత మీడియా పాయింట్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నయంటే అందుకు ముందు చూపులేని ఈ సన్నాసి ప్రభుత్వం, మూర్ఖపు ప్రభుత్వమే కారణమని అన్నారు.
లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎండల వలన పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి చేతగాని మాటలు చెబుతున్నాడని, అందుకు ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేతగానితనం, తెలివి లేని తనం, సాగునీటి నిర్వహణ ప్రాజెక్టుల నిర్వహణ చేయలేని తనం వల్లనే పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది కాబట్టి పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ.25 వేల చొప్పున పంట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్‌లోనే నిధులను కేటాయించాలన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రజల తరఫున తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఎండిన పంటల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రైతులకు అండగా, భరోసాగా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో తమ పార్టీ పర్యటిస్తుందన్నారు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల సోయిలేదు, బాధ లేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో 480 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డను ఎండబెట్టడం వలన రైతన్నలకు ఇబ్బంది అవుతున్నదని చెప్పారు. కాళేశ్వరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తున్నదని, బ్రోకర్లతో కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నదని ఆరోపించారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో పూర్తిగా పంటలు ఎండుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైనా జలాలను వాడుకునే తెలివి ప్రభుత్వానికి లేదన్నారు. కృష్ణా జలాలను వాడుకుని కృష్ణా పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండించామని చెప్పారు. గతంలో సాగునీరు అందిన పంటలు కూడా ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ పంటలను, రైతన్నలను ఎండబెడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని ఆరోపించారు.
కృష్ణ నీటిని 22% కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడలేదని, అందుకే పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతన్నలు తమ పంటలను మేకలు, గొర్లకు మేతగా వేసే పరిస్థితి ఉందన్నారు. దేవాదులకు పంపుల నిర్వహణ కోసం రూ.6 కోట్లు ఇవ్వకపోవడం వలన రూ.600 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పారు. లక్షల ఎకరాల పంట దెబ్బతిందన్నారు. ఈ దున్నపోతు ప్రభుత్వం మా నాయకులు లేపే దాకా మొద్దు నిద్ర లేవలేదని, దేవాదుల పంపులను పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నామని, రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ద్వేషంతో తెచ్చిన కరువని అన్నారు.