లక్ష మందితో సీఎం సభ సక్సెస్ చేయాలి
- ముఖ్య నాయకులతో జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి దిశానిర్ధేశం
- సభా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : లక్ష మందితో ముఖ్యమంత్రి సభ సక్సెస్ చేయాలని ముఖ్యనాయకులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సూచించారు. ఈ నెల 15న సంగారెడ్డి పట్టణంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ, వాహనాల పార్కింగ్ అంశాలపై జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పోలీస్ అధికారులు, ముఖ్య నాయకులతో బుధవారం రాత్రి 8గంటలకు సంగారెడ్డి పట్టణంలోని ఐబీ గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు.
ఐఐటీ వద్ద నుంచి ఐబీ గెస్ట్ హౌస్‌కు
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఐఐటీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బయలుదేరి నేరుగా ఐబీ చౌరస్తాకు చేరుకుంటారని తెలిపారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీల విగ్రహాలను సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం సీఎం ప్రసంగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం సభకు ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి వచ్చే లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వాహనాల కోసం గంజి మైదాన్, మెడికల్ కాలేజీలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వాహనాలకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
నియోజకవర్గం నుంచి 50వేల మంది
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 50 వేల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. అధికారుల ఆధ్వర్యంలో సుమారు 20 వేల మంది లబ్ధిదారులను సభకు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మందిని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి మొత్తం లక్ష మందితో సీఎం సభను విజయవంతం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు రఘుగౌడ్, కూన సంతోష్, కిరణ్‌గౌడ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
