కరీంనగర్‌లో స్వల్ప ఉద్రిక్తత

కార్పొరేటర్ ఇంటి ముట్టడికి బీఆర్‌ఎస్ కార్యకర్తల యత్నం

కరీంనగర్, ఆంధ్రప్రభ: కరీంనగర్‌లోని వావిలాలపల్లి 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు ఇంటి ముట్టడికి యత్నించిన కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల అప్రమత్తతతో పరిస్థితి సద్దుమణిగింది.

బండారి వేణు తన కుటుంబ సమస్య పరిష్కారం కోసం కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణకు సంబంధించిన ఆడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోత్సహించారంటూ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గంగుల కమలాకర్‌పై కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

విషయం పార్టీల మధ్య వివాదంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కార్పొరేటర్ ఇంటి సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పొన్నం అనిల్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ సీఐ సృజన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.