TGPSC | మూడు రోజుల్లో నాలుగో నోటిఫికేషన్..
TGPSC | మూడు రోజుల్లో నాలుగో నోటిఫికేషన్..
- నిరుద్యోగార్థులకు గుడ్ న్యూస్
- డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
- 24 గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే జూన్ 2న మూడు వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన కమిషన్, తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. గత మూడు రోజుల్లో టీజీపీఎస్సీ విడుదల చేసిన నాలుగో ఉద్యోగ నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం.
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO), గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 విభాగాల్లో మొత్తం 24 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ వెల్లడించింది.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 12 నుంచి ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో ప్రతి నెలా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అర్హతలు, ఎంపిక విధానం, రిజర్వేషన్లు, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలను టీజీపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అభ్యర్థులకు సూచించారు.

