ఒకే దరఖాస్తుతో బహుళ విద్యుత్ కనెక్షన్లు
- అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలకు టీజీఎన్పీడీసీఎల్ కొత్త సేవలు
- భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : విద్యుత్ వినియోగదారులకు మరింత సులభమైన, వేగవంతమైన, పారదర్శక సేవలను అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ బల్క్, మల్టిపుల్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ. రమేష్ తెలిపారు. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు అవసరమైన బహుళ విద్యుత్ కనెక్షన్లను ఇకపై ఒకే దరఖాస్తుతో పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
ఒకే దరఖాస్తుతో అన్ని కనెక్షన్లు..
ఒకే భవనంలోని అన్ని విద్యుత్ కనెక్షన్ల కోసం విడివిడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా, ఒకే దరఖాస్తుతో బహుళ కనెక్షన్లను నమోదు చేసుకునే అవకాశం ఈ విధానం ద్వారా లభిస్తుంది. దీంతో బిల్డర్లు, డెవలపర్లు, అపార్ట్మెంట్ యజమానులు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వాహకులు తక్కువ సమయంలో విద్యుత్ కనెక్షన్లు పొందవచ్చని ఎస్ఈ తెలిపారు.
వినియోగదారులకు పలు ప్రయోజనాలు
ఈ విధానం ద్వారా దరఖాస్తుల పరిశీలన, అనుమతులు, కనెక్షన్ల మంజూరు ప్రక్రియ వేగవంతం కానుంది. సమయం, వ్యయం రెండింటిలోనూ ఆదా కావడంతో పాటు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు. దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
లోడ్ ఆధారంగా చార్జీలు
అపార్ట్మెంట్లు, మల్టీ స్టోరీడ్ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు అవసరమైన బహుళ ఎల్.టి. (కేటగిరీ–1, కేటగిరీ–2) కనెక్షన్లకు ఈ విధానం వర్తిస్తుంది. మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా చార్జీలు నిర్ణయిస్తారు. 20 కిలోవాట్ల వరకు డెవలప్మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తించగా, 20 కిలోవాట్లకు మించి కేవలం సర్వీస్ లైన్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న విద్యుదీకరణ ఓవర్‌హెడ్ నెట్‌వర్క్‌కు ఈ విధానం వర్తిస్తుందని, అవసరమైన ట్రాన్స్ఫార్మర్ను డిస్కం ఎలాంటి అదనపు వ్యయం లేకుండా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. టీజీఈఆర్సీ రెగ్యులేషన్–01 ఆఫ్–2026 ప్రకారం పారదర్శక చార్జీలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
ఆన్లైన్లోనే దరఖాస్తు
బల్క్ లేదా మల్టిపుల్ అప్లికేషన్ నమోదు సమయంలోనే సర్వీస్ లైన్ చార్జీలను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని, దీంతో కనెక్షన్ల మంజూరు మరింత వేగంగా పూర్తవుతుందని తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 1912 లేదా 1800-425-0028 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఎస్ఈ ఎ. రమేష్ వినియోగదారులకు సూచించారు.
