భీమ్‌గల్‌లో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభం..

వినియోగదారులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలు

రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు ప్రత్యేక ఆర్థిక సేవలు.. పారదర్శక బ్యాంకింగ్‌నే లక్ష్యమన్న నిర్వాహకులు

భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ను కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ బి. నాగమణి స్వామి, బ్యాంక్ జీఎం ఎంవీజే శశికర్, ఏజీఎం తిరుపతి, బ్రాంచ్ మేనేజర్ సుమంత్‌తో కలిసి రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, భీమ్‌గల్ ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని చెప్పారు.

తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.4,557.34 కోట్ల వ్యాపారంతో, 9.35 లక్షల మంది వినియోగదారులతో అగ్రగామిగా సంస్థ కొనసాగుతోందని తెలిపారు. భీమ్‌గల్ ప్రాంత ప్రజలకు రుణాలు, పొదుపు పథకాలు, డిపాజిట్ సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

చిన్న వ్యాపారులు, రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యతతో ఆర్థిక సేవలు అందిస్తామని చెప్పారు. బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ పర్ధ ఆనంద్‌రావు మాట్లాడుతూ, కేవలం రూ.1,000 షేర్ మొత్తంతో సభ్యత్వాన్ని ప్రారంభించవచ్చని తెలిపారు. ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేకుండా పారదర్శక బ్యాంకింగ్ సేవలు అందించడమే బ్యాంకు లక్ష్యమని చెప్పారు.

రీజినల్ హెడ్ ఆర్.కె.వి. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ఆధార్ ఆధారిత నగదు లావాదేవీలు, ప్రభుత్వ సబ్సిడీలు, పెన్షన్ బదిలీలు, బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

బ్రాంచ్ మేనేజర్ జక్క సుమన్ మాట్లాడుతూ, రైతులు, వ్యాపారులకు వివిధ తనఖాలపై రుణాలు అందజేస్తామని, సేవింగ్స్, కరెంట్ ఖాతాలను వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవని, డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సంటి అలక నర్సయ్య, డైరెక్టర్లు ఆరేపల్లి శ్రీజ, మార్తాల లక్ష్మణ్, వర్ధ ఆనందరావు, పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు, మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు, కౌన్సిలర్లు, సర్పంచులు, బ్యాంకు సిబ్బంది, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.