Cristiano Ronaldo | రిటైర్‌మెంట్ వార్తలకు రొనాల్డో ఫుల్‌స్టాప్.. ‘ప్రపంచకప్ తర్వాతే నిర్ణయం’
Cristiano Ronaldo | రిటైర్‌మెంట్ వార్తలకు రొనాల్డో ఫుల్‌స్టాప్.. ‘ప్రపంచకప్ తర్వాతే నిర్ణయం’
Cristiano Ronaldo | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో రిటైర్‌మెంట్‌పై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఆయన స్వయంగా తెరదించారు. ప్రపంచకప్ అనంతరం తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేస్తూ రిటైర్‌మెంట్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రొనాల్డో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ అనంతరం రొనాల్డో సోదరి కాటియా అవైరో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రపంచకప్ టోర్నీనే రొనాల్డోకు చివరిదని ఆమె పేర్కొనడంతో, స్టార్ ఫుట్‌బాలర్ త్వరలోనే ఆటకు వీడ్కోలు పలుకుతారనే ప్రచారం మరింత ఊపందుకుంది.
అయితే ఈ ప్రచారాలపై తాజాగా స్పందించిన రొనాల్డో స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ప్రపంచకప్‌పైనే ఉందని, టోర్నీ ముగిసిన తర్వాతే తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు. ఇప్పుడే రిటైర్‌మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రొనాల్డో కెరీర్‌పై ప్రతి చిన్న వార్త కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అందుకే ఆయన రిటైర్‌మెంట్‌పై వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. అయితే తాజాగా రొనాల్డో ఇచ్చిన క్లారిటీతో ఆ ఆందోళనకు తెరపడింది.
సోషల్ మీడియాలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇంకా రొనాల్డో ఆటను ఆస్వాదించే అవకాశం ఉంది.., రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.., ప్రపంచకప్ తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు మద్దతుగా ఉంటాం.. అంటూ పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం రొనాల్డో దృష్టంతా ప్రపంచకప్‌పైనే ఉండగా, టోర్నీ ముగిసిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఫుట్‌బాల్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది. అప్పటి వరకు మాత్రం రిటైర్‌మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు తాత్కాలికంగా చెక్ పెట్టినట్లయ్యాయి.
