TG | మూడు పశువులకు తీవ్ర గాయాలు..
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెం గ్రామ సమీపంలో నాటుబాంబులు కలకలం రేపాయి. పొలాలకు సమీపంలో అమర్చిన బాంబులను గేదెలు నమలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
దేవునిగూడెం శివారు అటవి ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం స్మగ్లర్లు నాటుబాంబులు అమర్చినట్లు తెలుస్తోంది. మేత కోసం అటుగా వెళ్లిన గేదెలు వాటిని కొరకడంతో తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది పరిస్థితిని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా అడవిపందులు, జింకలు తదితర వన్యప్రాణులను వేటాడేందుకు స్మగ్లర్లు ఇలాంటి నాటుబాంబులు ఉపయోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినా వేట కొనసాగుతుండటంతో స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
