భూ సర్వేలో పాల్గొనండి..

రైతులకు ఎమ్మెల్యే కీలక పిలుపు

సర్వేతో భూ హక్కులకు చట్టబద్ధ రక్షణ..

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్/గణపురం, ఆంధ్రప్రభ: భూముల సర్వే, సరిహద్దుల నిర్ధారణ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమ భూముల హక్కులను చట్టబద్ధంగా నమోదు చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు.

శనివారం గణపురం మండలం బుద్ధారం, భూపాలపల్లి రూరల్ మండలం కమలాపూర్ గ్రామాల్లో తెలంగాణ భూ సర్వే–సరిహద్దుల నిర్ధారణపై నిర్వహించిన గ్రామసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో భూముల సర్వే ప్రక్రియను వేగవంతం చేస్తోందని, నియోజకవర్గంలోని సుమారు 50 వేల మంది పట్టాదారుల సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో వేల ఎకరాల భూములకు పట్టాల సమస్యలు ఉన్నాయని, సర్వే ద్వారా వాటికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. భూమి యజమాని ప్రత్యక్షంగా హాజరు కాకపోయినా అవసరమైన వివరాలు నమోదు చేసి సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో పలుమార్లు చర్చించి ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

పట్టాలు లేక రైతు భరోసా, రైతు బీమా, భూముల రిజిస్ట్రేషన్ వంటి ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోతున్న రైతులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. సింగరేణి, సోలార్ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతుల సమస్యల పరిష్కారానికీ ఈ సర్వే దోహదపడుతుందని పేర్కొన్నారు.

సర్వే ద్వారా ప్రభుత్వ, లావాణి, సీలింగ్ తదితర భూముల వివరాలు స్పష్టంగా నమోదై, అర్హులకు చట్టబద్ధ హక్కులు కల్పించబడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఏడి ల్యాండ్ సర్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.