TG | డికె అరుణ‌కు రేవంత్ ఫోన్ కాల్ …ఆగంత‌కుడు ప్ర‌వేశంపై ఆరా ..

హైద‌రాబాద్ – మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో నిన్న అగంతకుడు ప్రవేశించిన విషయం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఘటన గురించి ఎంపీకి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రతను మరింత పెంచాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి డీకే అరుణను ఫోన్‌ ద్వారా సంప్రదించారు. ఈ ఘటన ఎలా జరిగింది? ఆగంతకుడు ఎవరు? ఆయన ఉద్దేశం ఏంటి? అన్న విషయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. భద్రతా పరంగా లోపాలేమైనా ఉన్నాయా? పోలీసుల నుంచి తగిన సహాయసహకారాలు అందుతున్నాయా? అనే విషయాలపై కూడా చర్చించారు.

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి..
ఈ ఘటనలో తన అనుమానాలను డీకే అరుణ సీఎంతో ప్రస్తావించారు. అకారణంగా తన నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించడం శోచనీయమని, ఇది భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, డీకే అరుణ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఆమెకు అదనపు భద్రత కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయ నేతల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిజమైన కారణాలను వెలికితీయాలని సీఎం పోలీసులను ఆదేశించారు. ఈ కేసును వేగంగా పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *