TG | ఆవిర్భావ దినోత్సవానికి ప్రభుత్వ సన్నాహాలు..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించేలా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను చ‌ర్చించారు. జూన్ 2న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జెండా వందనం, మార్చ్ పాస్ట్, సీఎం ప్రసంగం, ఉత్తమ సేవలకుగానూ అధికారులకు మెడల్స్ ప్రదానం కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.

ఈ ఏడాది రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జపాన్ మేయర్‌తో పాటు మిస్ వరల్డ్ విజేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాష్ట్ర కీర్తిని ప్రదర్శించేలా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికలతో వేడుకలకు సిద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాజీవ్ యువ వికాసం ప్రారంభోత్సవం జూన్ 2న

ఇందిరమ్మ రాజ్య పాలనలో యువతకు భరోసానిచ్చేలా రూపొందించిన “రాజీవ్ యువ వికాసం” పథకాన్ని కూడా అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు.

ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పన కోసం ఈ ఏడాది రూ.8,000 కోట్లను కేటాయించారు. జూన్ 2న ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్లు పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ 2నాటికి మొత్తం 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెంనరేందర్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply