రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో నియమించిన త్రిసభ్య కమిటీ డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయింది. ఉద్యోగుల డిమాండ్లను, వారు లేవనెత్తిన అభ్యతంరాలు, సమస్యలను భట్టికి వివరించారు.
సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్, పంచాయత్ రాజ్ సెక్రెటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్‌కో సిఎండి కృష్ణ భాస్కర్‌లు డిప్యూటీ సీఎం భట్టితో చర్చించారు. ఈ కమిటీ ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించిన విషయం తెలిసిందే.
కాగా, ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం, ఉద్యోగుల సమస్యల పరిష్కార సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్కకు వివరించారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, అనువైన డిమాండ్లను కొద్దిసేపు చర్చించింది. ఆర్ధిక, ఆర్ధికేతర డిమాండ్లపై రూపొందించిన నివేదికను అందించనున్నట్లు పేర్కొంది.
ఇక ఈనెల 29న సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని సబ్ కమిటీ సమావేశంలో వివరించాలని అధికారుల కమిటీకి డిప్యూటీ సీఎం సూచించారు.