రాష్ట్ర ప్రభుత్వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రామగుండం -1 ఏరియాలో సింగరేణి సిఎండి ఎన్. బలరామ్ పార చేత పట్టుకొని స్వయంగా 500 మొక్కలు నాటి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ ట్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న ఎన్.బలరామ్ 2019 నుండి ఇప్పటి వరకు ఆయన సింగరేణి వ్యాప్తంగా 52 ప్రదేశాలలోస్వయంగా 19,570 మొక్కలను నాటగా అవి నేడు వనాలుగా పెరుగుతున్నాయి.
ఆదివారం నాటి కార్యక్రమంలో ఆయనతోపాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ ఇంకా ఇతర అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొని మరో 500 మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని , ప్రతి అడుగు పచ్చదనం చేసేలా ప్రతి ఒక్కరూ తమకు గల ఖాళీ ప్రదేశాల్లో కనీసం మూడు మొక్కలను నాటాలని ,వాటిని పెంచాలని కోరారు.
భావితరాలకు మన వారసులకు మనం ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని మొక్కలను పెంచి వారికి అందిస్తే అదే గొప్ప ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికే 14 వేల హెక్టార్లలో ఏడు కోట్లకు పైగా మొక్కలను నాటిందని, అవి నేడు పెద్ద వనాలుగా పెరుగుతున్నాయి అన్నారు.
కాబట్టి సింగరేణి ప్రాంతాలు ఇతర ప్రాంతాల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటున్నాయని, ఇది కేవలం మొక్కలు నాటడం వలన మాత్రమే సాధ్యపడిందన్నారు. కొత్త గనులు ప్రారంభిస్తున్నప్పుడు, రోడ్ల విస్తరణ సందర్భంగా అక్కడ ఉన్న వృక్షాలను తొలగించాల్సి వచ్చినప్పుడు వాటిని నరికి వేయకుండా వాటిని ట్రాన్స్ లోకేషన్ పద్ధతిలో వేరేచోటికి తీసుకెళ్లి తిరిగి నాటడం జరిగిందని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగతంగా ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటుతూ వస్తున్నానని, తాను నాటిన మొక్కలు 40 మినీ వనాలుగా పెరగడం ఎంతోసంతోషంగా ఉందన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఏడాది 45 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుందని ,ఇప్పటికే సుమారు ఐదు లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. అన్ని ఏరియాల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ మాట్లాడుతూ ఒక సంస్థకు ఉన్నతాధికారిగా చైర్మన్ గా ఉన్న శ్రీ ఎన్. బలరామ్ స్వయంగా మొక్కలు నాటుతూ అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో సిఎంఓఎఐ అధ్యక్షులు బి. మల్లేష్, ఏఐటియుసి, డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ , ఏరియా ఉన్నతాధికారులు ఎజంట్స్ మేనేజర్లు, మరియు కార్మికులు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.