మత్తుతో జీవితాలను చిత్తు చేసుకోవద్దు

మత్తుతో జీవితాలను చిత్తు చేసుకోవద్దు
- కుంటాల ఎస్సై అశోక్
- కల్లూరులో ‘గంజాయి గస్తీ’పై విస్తృత అవగాహన
కుంటాల, ఆంధ్రప్రభ: యువత మత్తుపదార్థాలకు బానిసై తమ విలువైన జీవితాలను చిత్తు చేసుకోవద్దని కుంటాల ఎస్సై సి. అశోక్ హితవు పలికారు. బుధవారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన ‘గంజాయి గస్తీ’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గంజాయి వాడటం మాత్రమే కాకుండా, దానిని విక్రయించినా చట్టరీత్యా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి మత్తులో యువత నేరప్రవృత్తి వైపు మళ్లుతున్నారని, దీనివల్ల కన్నవారి ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పోలీస్ నిబంధనలను గౌరవించాలని కోరారు.
ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా చూడాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. ఈ అవగాహన సదస్సులో స్థానిక సర్పంచ్ పెంటవార్ దశరథ్, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
