నాగారంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

నాగారంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
- రసాయనిక మందుల వాడకంపై అవగాహన
పరకాల, ఆంధ్రప్రభ: రైతులు సాగు ఖర్చులను తగ్గించుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుకునేలా శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని నాగారం సర్పంచ్ ఏరుకొండ రమాదేవి , వ్యవసాయ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. పరకాల మండలం నాగారం గ్రామంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ఆల్ దాస్ జానయ్య ఆదేశాల మేరకు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, రైతులు పంటల్లో అనవసరంగా యూరియా, నత్రజని వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అధిక రసాయనిక మందుల వల్ల గాలి, నీరు, భూమి కలుషితం కావడమే కాకుండా, కీటకాలు రోగనిరోధక శక్తిని పెంచుకుని నియంత్రణకు లొంగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
శాస్త్రవేత్తలు సూచించిన కీలక అంశాలు:
పంటను ఆశించే పురుగును సరిగ్గా గుర్తించిన తర్వాతే తగిన మందును ఎంచుకోవాలి.
పురుగుమందుల పిచికారీ సమయంలో రైతులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించాలి.
భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను సమగ్రంగా ఆదా చేస్తూ సాగు చేయాలి.
పత్తిలో గులాబీ రంగు పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు, మిరపలో నల్లి, తామర పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
మండల వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి రైతు మట్టి పరీక్షలు చేయించుకోవాలని, గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్ కుమార్, ఏఈఓ కాటంరాజు, రైతు నాయకులు లక్ష్మారెడ్డి, సాంబారెడ్డి, దాసరి బిక్షపతి, కానుగుల బిక్షపతితో పాటు సుమారు 50 మంది రైతు సోదరులు పాల్గొన్నారు.
