బీజేపీ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ హత్యా దివస్’ నిరసన
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన “సంవిధాన్ హత్యా దివస్” (రాజ్యాంగ హత్య దినం) సందర్భంగా గురువారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన, స్మరణ కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వల్లభు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 1975లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కులను సస్పెండ్ చేయడం, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, పత్రికలపై సెన్సార్షిప్ విధించడం వంటి చర్యలతో ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీశారని విమర్శించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నాయకుల త్యాగాలను స్మరించుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఆనాటి ఘటనలను మరువకుండా భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ, 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించిందన్నారు. ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వరాచారి, జిల్లా నాయకుడు ఓలం శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షురాలు నాగరబోయిన చంద్రకళ, బచ్చు లక్ష్మీనారాయణ, కొండ్రెడ్డి వీరారెడ్డి, గుండు దామోదర్, మూడావత్ అశోక్, బాణోత్ సురేందర్, వెలిశాల నవీన్, ముదిరెడ్డి మురళి, గొట్టె వెంకన్న, పెరుమాండ్ల నవీన్, బేతి వెంకన్న, బానోత్ రాము, బొద్దుల సతీష్, జాటోత్ సురేష్, వాంకుడోత్ మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
