మునుగోడులో తాను చేసిన అభివృద్ధి పనులు తప్ప కొత్తగా చేసిందేమిలేదు
మునుగోడులో తాను చేసిన అభివృద్ధి పనులు తప్ప కొత్తగా చేసిందేమిలేదు
చౌటుప్పల్ లో ఫ్లైఓవర్ నిర్మాణం గురించి, ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు
కేసీఆర్ హయాంలోనే త్రాగు సాగునీటి సమస్యను పరిష్కరించాము
సర్వీస్ రోడ్ లో ఉన్న దర్గాకు పరిహారం చెల్లించి కూడా తొలగించడం లేదు
తనను విమర్శించే హక్కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి లేదు
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడులో తాను చేసిన అభివృద్ధి పనులు తప్ప కొత్తగా చేసిందేమిలేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనను విమర్శించే హక్కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లేదన్నారు. చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం గురించి, ప్రజల సమస్యల గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గానికి జిల్లా మంత్రులను గాని, కనీసం ఎంపీ ని గాని తీసుకు రాలేదని, ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు తీసుకురాకుండా తాను సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లుగా గొప్పగా బోకస్ ప్రచారం చేసుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఫ్లోరైడ్ సమస్య ను పరిష్కరించి ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగునీటిని అందించామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదని, ఈ ప్రాంత సమస్యల పై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. తాను ఏం మాట్లాడిన ఇన్ స్టా రీల్స్ చేయిస్తున్నాడని, రీల్స్ తో మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని నియోజక వర్గాల్లో కన్నా మునుగోడు నియోజకవర్గంను ఎక్కువ అభివృధి చేసుకున్నామని, కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం కు సాగు, త్రాగు నీరు ప్రాజెక్ట్ లు వచ్చాయి, రోడ్లు, వంద పడకల ఆసుపత్రి నిర్మించుకున్నామన్నారు. చౌటుప్పల్ పట్టణంలో ఫ్లై ఓవర్ నిర్మాణం పనులపై తాను ఏం మాట్లాడుతుండో తనకే తెలియదన్నారు. సర్వీస్ రోడ్ లో ఉన్న దర్గాకు పరిహారం చెల్లించి కూడా తొలగించడం లేదన్నారు.
గత 15 సంవత్సరాలుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశావో చెప్పాలని స్థానిక ఎమ్మెల్యే ను నిలదీశారు. తాను ఉప ఎన్నికల్లో గెలిచి మంజూరు చేయించిన పనులను కూడా ఇప్పటికీ పూర్తి చేయలేదు. దమ్ము, ధైర్యం ఉంటే మళ్ళీ రాజీనామా చేసి రా ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామని కూసుకుంట్ల సవాలు విసిరారు. చౌటుప్పల్ పట్టణంలో సంవత్సరం నుండి జరుగుతున్న ఫ్లై ఓవర్ పనులను పట్టించుకోలేదని, రోడ్డు నిర్మాణం పనులపై సమీక్ష నిర్వహించలేదని, మేము బీఆర్ఎస్ తరపున ధర్నా చేసాం, అధికారులను కలిసి అండర్ పాస్ ఏర్పాటు తదితర సమస్యలను వివరించాము. అధికారులు బస్ స్టేషన్ వద్ద అండర్ ప్రాసెస్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారన్నారు.
తాను ఉద్యోగం వదిలి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చానని, నీలా కాంట్రాక్ట్ పనులు చేయకుండానే బిల్లులు తెచ్చుకునే పెద్ద కాంట్రాక్టర్ ను కాదన్నారు. ఎమ్మెల్యే , ఎంపీ ఎన్నికల సమయంలో త్రిబుల్ ఆర్ రోడ్డు అలైన్మెంట్ ను దివిస్ పరిశ్రమ అవతల నుండి మారుస్తామని ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తో చేప్పించారు, అధికారంలోకి వచ్చారు, త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మార్చకుండా మా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు నిందలు వేస్తున్నారని కూసుకుంట్ల ప్రశ్నించారు.
జాతీయ రహదారి రోడ్డు వెడల్పు లో దర్గా కోసం 1 కోటి రూపాయలు పరిహారం ఇచ్చాము. వారు డబ్బులు కూడా తీసుకున్నారు. ప్రయాణికులు, వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు, సర్వీస్ రోడ్ నిర్మాణం కోసం రోడ్డు లో ఉన్న దర్గాను తొలగించి పిల్లర్లపై ఎలివేటర్ కారిడార్ ను నిర్మించాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జనగాం లో రూ. 13 కోట్లతో ఆశ్రమం నిర్మించావు. అదే నీ నియోజకవర్గంలో ఎందుకు నిర్మించలేదన్నారు. తనను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి లేదన్నారు. ఈ ప్రాంత అభివృధి కోసం నిత్యం పాటు పడ్డాను. రైతుల యూరియా సమస్యలపై, రైతు బంధు, రైతు భరోసా, కళ్యాణ లక్మి, తులం బంగారం రావడం లేదని అసెంబ్లీలో అడిగావా అని ప్రశ్నించారు.
రైతుల కోసం డిండి ప్రాజెక్ట్ నుండి నీళ్లు వచ్చేలా లేవు, ఎదుల ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు వెళ్తున్నాయన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో ఇంకా వడ్లు కొనుగోలు చేస్తలేరు. చేసిన చోట బస్తాకు 10 కిలోలు తరుగు తీస్తున్నారన్నారు. తమపై కోమటిరెడ్డి ఆరోపణలు చేయడం మానుకోని ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని కూసుకుంట్ల హితవు పలికారు. మీ సమావేశంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పెద్దది బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
