హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ట్యాప్ చేసిన ఫోన్ నెంబర్లలో ఆయన నెంబర్ ఉండడంతో కొంత సమాచారం కావాలని సిట్ కోరడంతో కార్యాలయానికి వెళ్లారు. సిట్ కు ఆయన స్టేట్ మెంట్ ను ఇచ్చారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ చేసి తమ మూమెంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. ఇదే ఫిర్యాదును గతంలో చేశాను.. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయని తెలిపారు.
చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లు టాప్ చేశారు.. ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల ఫోన్లో ట్యాప్ చేయడం హేయమైన చర్య.. ఇలాంటి చర్యకు పాల్పడ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. తాము మాత్రమే శాశ్వతంగా అధికారంలో ఉండాలి అనే చెడు ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. 2018లో తాము ఓడిపోవడానికి కారణం కూడా ఫోన్స్ ట్యాప్ చేయడం వల్లే అని అర్థమైందని అన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయన్నారు.
నక్సలైట్ల పేరుతో నా ఫోన్ ట్యాప్
తన పూర్తి పేరు పెట్టకుండా నక్సలైట్లకు సింపతైజర్లుగా ఉన్నారని ట్యాప్ చేయడం సిగ్గుచేటని, కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లను ట్యాప్ చేయడం దుర్మార్గమైన చర్య.. ఆనాడు తమ ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేశారని, అందుకు వారు శిక్షార్హులన్నారు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఇలాంటి దిగజారుడు పనికి ఒడిగట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా శిక్ష పడాలన్నారు.
ప్రభాకర్ రావు నాటి సీఎస్ ఇద్దరు కలిసి ఎన్నికల ముందు రెండు సంవత్సరాలు ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఆనాడు ఆకస్మాత్తుగా తమ కార్లు ఆపేవారని, ఆపి తనిఖీలు చేసేవారని, అనుక్షణం పోలీసులు తమను నీడలా వెంటాడేవారని, అకారణంగా అనేకసార్లు గృహనిర్బంధాలు చేశారని గుర్తు చేశారు.