ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలతో వినియోగదారులకు ఊరట

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలతో వినియోగదారులకు ఊరట

క్రాస్ సెల్లింగ్‌పై పెరుగుతున్న విమర్శలు.. ఆర్బీఐ కఠిన నిర్ణయం

ఉద్యోగులపై లక్ష్యాల ఒత్తిడికి చెక్.. వినియోగదారుల సమ్మతికి ప్రాధాన్యం

2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలు

భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో క్రాస్ సెల్లింగ్ ఒకటి. రుణాలు, డిపాజిట్లు వంటి సంప్రదాయ బ్యాంకింగ్ సేవలతో పాటు బీమా, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక ఉత్పత్తులను విక్రయించేందుకు బ్యాంకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది ఒక్క ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఎక్కువగా జరుగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులపై **భారీ లక్ష్యాలు విధించడం, వినియోగదారులపై పరోక్ష ఒత్తిళ్లు, కొన్ని సందర్భాల్లో మిస్ సెల్లింగ్ ఆరోపణలు రావడం సాధారణమైంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం జరిగిన ఒక సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులకు భీమా వంటి ఆర్థిక ఉత్పత్తులను తప్పుడు వివరాలతో బ్యాంకుల్లో విక్రయించడంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

బ్యాంకులు తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టాలని, అవసరం లేకపోయినా భీమా ఉత్పత్తుల విక్రయానికి బ్యాంకులు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకుల నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) మధ్య ఉన్న నిర్వహణపరమైన దూరం వల్ల ఎవరికీ జవాబుదారితనం లేకుండా పోయిందన్నారు. ఇకపై బ్యాంకులు ఇటువంటి పనులు చేయలేరనే స్పష్టమైన సందేశం వెళ్లాలని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. బ్యాంకులు రుణాలు, డిపాజిట్లపై దృష్టి సారించాలని సూచించారు.

గృహ రుణం తీసుకునేందుకు ఇల్లు, స్థలం తాకట్టు పెడుతుండగా మళ్లీ బీమా పాలసీ తీసుకోమని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బ్యాంకింగ్ రంగానికి చెందిన అన్ని యూనియన్లు కూడా ఈ అంశాన్ని తమ డిమాండ్లలో ఒకటిగా చేర్చాయి. ఈ వైఖరితో బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి బాగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పథకాల అమ్మకాల కోసం బ్యాంకులు తమ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేలా లేదా ఎక్కువ అమ్మకాలను ప్రోత్సహించే ఇన్సెంటివ్ విధానాలపై నిషేధం విధించింది. వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త మార్గదర్శకాలను కూడా ఖరారు చేసింది.

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయానికి ముందు వినియోగదారుల స్పష్టమైన సమ్మతి తీసుకోవాలి. వినియోగదారుల సమ్మతిని ఓటీపీ ధ్రువీకరణలు లేదా రికార్డు చేసిన నిర్ధారణ రూపంలో నమోదు చేయాలి. తమ ఉత్పత్తులను వేరువేరుగా వివరించి వినియోగదారులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలి.

బ్యాంకుల తరఫున పనిచేసే బిజినెస్ కరస్పాండెంట్లు, డైరెక్ట్ సేల్స్ ఏజెంట్లు, రుణ సేవల సంస్థల చర్యలకు కూడా బ్యాంకులే బాధ్యత వహించాలి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వినియోగదారుల అవసరాలకు సంబంధంలేని భీమా, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా విక్రయించడంపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణ సంస్థల ద్వారా ఆర్థిక ఉత్పత్తుల ప్రకటన, మార్కెటింగ్, అమ్మకాల కోసం సమగ్ర మార్గదర్శకాలు అమలు చేయనుంది. ఈ ఆదేశాలు అన్ని పంపిణీ మార్గాల్లో వినియోగదారుల రక్షణ, పారదర్శకత, కఠినమైన జవాబుదారీతనం నిర్ధారించేలా ఉంటాయి.

సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల ఉద్యోగులకు థర్డ్ పార్టీ సంస్థల (భీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు) నుంచి నేరుగా ప్రోత్సాహకాలు, రివార్డులు చెల్లించడాన్ని ఆర్బీఐ పూర్తిగా నిషేధించింది.

బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే సొంత ప్రోత్సాహకాలను ఆర్బీఐ నిషేధించలేదు. అయితే ఖాతాదారులను బలవంతపెట్టేలా, తప్పుదోవ పట్టించేలా ఉత్పత్తులను విక్రయించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా ఇవి ఉండకూడదని స్పష్టం చేసింది.

బ్యాంకింగ్ వ్యవస్థలో క్రాస్ సెల్లింగ్ కొత్త విషయం కాదు. సేవాధోరణి నుంచి లక్ష్యాల ఆధారిత వ్యాపార ధోరణిగా మారింది. రుణం కావాలంటే భీమా పాలసీ తీసుకోవాలనే సూచనలు, ఖాతా ప్రారంభించాలంటే ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిళ్లు, వినియోగదారుల అవసరాలకు సరిపోని పెట్టుబడి ఉత్పత్తులను విక్రయించడం వంటి పరిణామాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. దీనివల్ల బ్యాంకులపై ఉన్న విశ్వాసం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.

ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకు ఉద్యోగులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్లు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చి పోరాటం జరిపిన విషయం తెలిసిందే. అలాగే పని ఒత్తిడితో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరం.

అయితే కేవలం మార్గదర్శకాలు విడుదల చేయడంతో సరిపోదు. ఆచరణలో ఎలా అమలు అవుతుందో పరిశీలించాలి. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ చొరవ తీసుకొని సమన్వయంతో కృషి చేస్తేనే ఆశించిన ఫలితం వస్తుంది. నిజాయితీతో అమలు అయితే బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, వినియోగదారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. లేని పక్షంలో షరా మామూలే.