వారాహి దేవి అవతార విశేషం.. సప్తమాతృకల్లో విశిష్ట స్థానం

వారాహి దేవి అవతార విశేషం.. సప్తమాతృకల్లో విశిష్ట స్థానం

ఆషాఢమాసం ఈ నెల 15వ తేదీ ప్రారంభమైన ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులను నవమి వరకు నిర్వహిస్తారు. పదో రోజున అమ్మవారిని శాకాంబరీ మాతగా అలంకరించి ప్రార్థిస్తారు. ఈ నవరాత్రులు ఉత్తరాది రాష్ట్రాల్లో నవదుర్గ పూజల రూపంలో నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో కొద్ది దేవాలయాల్లో, వారాహి దేవి విశిష్టత తెలిసిన భక్తులు ఈ నవరాత్రులను ఆచరిస్తున్నారు.

సంసార చక్రంలో అనేక కష్టనష్టాలతో ఉన్న వారిని ఉద్ధరించేందుకు వరాహమూర్తి దంష్ట్ర (కోరలు) నుంచి అవతరించిన అమ్మవారే వారాహి అని పురాణాలు పేర్కొంటాయి.

వారాహి దేవి ఎవరు?

జగన్మాత సప్తమాతృకలైన బ్రాహ్మీ, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండిలలో వారాహి ఒకరుగా వెలుగొందుతూ, లలితా అమ్మవారికి సైన్యాధిపతిగా ఉంటారని పురాణాలు వివరిస్తాయి.

జగన్మాత దుర్గముడు, భండాసురుడు, మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షసుల సంహారం కోసం అనేక రూపాల్లో అవతరించిందని పేర్కొంటాయి. మార్కండేయ పురాణం ప్రకారం భండాసురుని సైన్యాధిపతి రక్తబీజుడు. అతని శరీరం నుంచి నేలపై పడిన ప్రతి రక్తపు బొట్టు నుంచి వేలాది రక్తబీజులు ఉద్భవించేవారు.

అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో చండీదేవికి నాలుక చాపి రక్తపు బొట్లు నేలపై పడకుండా చూడమని ఆదేశించగా, చండీదేవి అలాగే చేయడంతో వారాహి దేవి యుద్ధం చేసి రక్తబీజుడు, విశుక్రుడు, విషంగుడు అనే రాక్షసులను సంహరించింది.

అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఇలా పేర్కొన్నారు.

“విశుక్రప్రాణ హరణా వారాహీ వీర్య నందితా ।
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥”

విశుక్రుడు కూడా భండాసురుని సోదరుడే. భండాసురుడిని రక్షిస్తున్న విషంగుడు, విశుక్రులను వారాహి దేవి సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి.

నవరాత్రుల్లో తొమ్మిది రూపాలు

వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధిస్తారు.

  • ఉన్నత వారాహి
  • బృహత్ వారాహి
  • స్వప్న వారాహి
  • కిరాత వారాహి
  • శ్వేత వారాహి
  • ధూమ్ర వారాహి
  • మహా వారాహి
  • దండిని వారాహి
  • రక్షక వారాహి

వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలి?

వారాహి నవరాత్రులు లేదా వ్రతం చేయడానికి ప్రధాన కారణాలు ఇవిగా పేర్కొంటారు.

  1. జగన్మాత అనుగ్రహం పొందేందుకు.
  2. కుటుంబ శ్రేయస్సు, నిర్మలమైన, నిశ్చలమైన జీవితం కోసం.
  3. భయాందోళనలు తొలగించేందుకు.
  4. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడేందుకు.
  5. నరదృష్టి, ఇతర దృష్టిదోషాల నివారణ కోసం.

వారాహి నవరాత్రుల పూజా విధానం

ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు పూజామందిరంలో కొత్త వస్త్రం లేదా జాకెట్ ముక్క ఉంచి, దానిపై బియ్యం పోసి కలశ స్థాపన చేయాలి. అనంతరం వారాహి అమ్మవారి ఫొటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రాణ ప్రతిష్ఠ అనంతరం షోడశోపచార పూజలు నిర్వహించాలి.

అష్టోత్తర శతనామావళితో పుష్పార్చన చేసి, కొబ్బరికాయ చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.

“ఓం ఐం శ్రీం క్రీం విపత్కర ప్రాణహరణా వారాహి వీర్య నందితా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

నైవేద్యంగా బెల్లం పొంగలి, గేదె పాలతో చేసిన పదార్థాలు, పెరుగు, పండ్లు సమర్పించి మంగళహారతితో పూజను ముగించాలి. ఇదే విధానాన్ని తొమ్మిది రోజుల పాటు కొనసాగించాలి.

పదో రోజు కలశం, బియ్యాన్ని పురోహితులకు దక్షిణ, తాంబూలాలతో సమర్పించాలి.

మణిద్వీపంలో అష్టదిక్కుల్లో అష్టమాతృకలకు మహాసౌధాలు ఉన్నాయని, వారాహి మాతకు ఉత్తర దిశలో స్థానం ఉందని పురాణాలు వివరిస్తాయి. ఆమె ఆలయం ముందు వాహనాలు, సైన్యం సిద్ధంగా ఉంటాయని పేర్కొంటాయి.

ఇంతటి విశిష్టత, ఆధ్యాత్మిక మహిమ కలిగిన వారాహి అమ్మవారి నవరాత్రులు లేదా వ్రతాన్ని ఆచరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.

– అనంతాత్మకుల రంగారావు