ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బ్రిక్స్ అతిథులకు విందు
- ఎనిమిది దేశాల మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వక భేటీ
- హైదరాబాద్‌లో 12వ బ్రిక్స్ కార్మిక, ఉపాధి శాఖల మంత్రుల సదస్సు
- విందు ఏర్పాటు చేసిన కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి శాఖల మంత్రుల ప్రతినిధి బృందానికి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చిన మంత్రులు, ప్రతినిధులతో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాలకు చెందిన మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. వారితో కొద్దిసేపు ముచ్చటించి సాదరంగా పలకరించారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న 12వ బ్రిక్స్ కార్మిక, ఉపాధి శాఖల మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల ప్రతినిధులు నగరానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అతిథుల గౌరవార్థం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేసింది.
ఈ విందులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.



