భారత్‌–బ్రిటన్ వాణిజ్యంలో కొత్త శకం

  • అమల్లోకి సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం
  • బ్రిటన్‌కు భారత ఎగుమతుల్లో 97.7 శాతం వాణిజ్య విలువపై సుంకాలు సున్నా
  • 9,249 బ్రిటన్ సుంక శ్రేణులపై పూర్తి మినహాయింపు
  • భారత్‌లోనూ 7,747 సుంక శ్రేణులపై సుంకాల తొలగింపు
  • కార్లు, విస్కీ, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం

భారత్‌–బ్రిటన్ ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో కీలక అధ్యాయం మొదలైంది. రెండు దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం జూలై 15, 2026 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీంతో బ్రిటన్ మార్కెట్‌లో భారత ఎగుమతులకు భారీ సుంక ప్రయోజనాలు లభించనున్నాయి. అదే సమయంలో బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చే అత్యధిక ఉత్పత్తులకూ సుంక రాయితీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 2025 మే 6న ఇరు దేశాలు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. అనంతరం 2025 జూలై 24న లండన్‌లో ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగాయి. రెండు దేశాల నాయకత్వ స్థాయిలో జరిగిన సంప్రదింపులు, అవసరమైన అమలు ప్రక్రియలు పూర్తయిన అనంతరం తాజాగా ఒప్పందం కార్యరూపం దాల్చింది.

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్‌–బ్రిటన్ మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రెండు దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఒప్పందంపై సంతకాలు జరిగిన ఏడాది తర్వాత ఇది కార్యరూపం దాల్చింది. ఎన్నో ఏళ్ల చర్చలు, సంప్రదింపులు, వ్యూహాత్మక సహకారానికి ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ఊతమివ్వనుంది. మార్కెట్‌ అవకాశాలను విస్తరించడం, వాణిజ్య ప్రక్రియలను సరళీకరించడం, సేవల రంగంలో అవకాశాలను పెంచడం, వృత్తి నిపుణుల రాకపోకలకు వెసులుబాటు కల్పించడం ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు. దీంతో భారత ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్‌లో భారీ సుంక ప్రయోజనాలు లభించనుండగా.. బ్రిటన్ ఉత్పత్తులకు భారత మార్కెట్‌లోనూ దశలవారీగా సుంకాల భారం తగ్గనుంది.

భారత ఎగుమతుల్లో దాదాపు 99 శాతం ఉత్పత్తులకు బ్రిటన్‌ మార్కెట్‌లో సున్నా సుంక ప్రవేశం లభించనుంది. వాణిజ్య విలువ పరంగా చూస్తే దాదాపు మొత్తం భారత ఎగుమతులు ఈ ప్రయోజనం పరిధిలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం, మత్స్యరంగం, తయారీ, సేవలు, వస్త్రాలు, తోలు, పాదరక్షలు, రత్నాలు–ఆభరణాలు, ఆహార శుద్ధి, ఇంజినీరింగ్‌, ఔషధాలు, రసాయనాలు, ప్లాస్టిక్‌, సమాచార సాంకేతిక రంగాలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి.

అదే సమయంలో దేశీయంగా సున్నితమైన రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు భారత్‌ జాగ్రత్తగా వ్యవహరించింది. కీలక వ్యవసాయ ఉత్పత్తులు, వ్యూహాత్మక పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వడం లేదా దశలవారీగా సుంకాలను తగ్గించే విధానాన్ని అనుసరించింది. డిజిటల్‌ వాణిజ్యం, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి కూడా ఈ ఒప్పందంలో ప్రాధాన్యం ఇచ్చారు.

రెండు భారీ ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వ్యాపారం

2025లో భారత స్థూల దేశీయోత్పత్తి 3.96 లక్షల కోట్ల అమెరికా డాలర్లుగా ఉండగా, బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.84 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. ప్రపంచ వాణిజ్యంలో రెండు దేశాల ప్రాధాన్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025–26లో భారత్‌–బ్రిటన్‌ మధ్య వస్తు వాణిజ్యం 25.12 బిలియన్‌ డాలర్లకు చేరింది. బ్రిటన్‌కు భారత్‌ 13.44 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయగా, 11.68 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. దీంతో భారత్‌కు 1.76 బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులు నమోదైంది.

సేవల వాణిజ్యంలోనూ భారత్‌ బలమైన స్థితిలో ఉంది. 2024లో రెండు దేశాల మధ్య సేవల వాణిజ్యం 35.44 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత్‌ 21.66 బిలియన్‌ డాలర్ల సేవలను బ్రిటన్‌కు ఎగుమతి చేయగా, 13.78 బిలియన్‌ డాలర్ల సేవలను దిగుమతి చేసుకుంది. ఫలితంగా సేవల రంగంలో భారత్‌కు 7.88 బిలియన్‌ డాలర్ల మిగులు లభించింది.

రైతులు.. మత్స్యకారులు.. చిన్న పరిశ్రమలకు కొత్త మార్కెట్‌

ఈ ఒప్పంద ప్రయోజనాలు కేవలం భారీ కంపెనీలకే పరిమితం కాకుండా సమాజంలోని విభిన్న వర్గాలకు చేరేలా నిబంధనలు రూపొందించినట్లు కేంద్రం పేర్కొంది. బ్రిటన్‌ మార్కెట్‌లో సుంకాల తొలగింపుతో భారత రైతులు, మత్స్యకారులకు కొత్త ఎగుమతి అవకాశాలు లభించనున్నాయి. ఎగుమతులు పెరిగితే ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించి ఆదాయాలు బలపడే అవకాశం ఉంది.

అటవీ ఆధారిత జీవనోపాధిపై ఆధారపడిన సముదాయాల ప్రయోజనాలకు కూడా ఒప్పందంలో ప్రాధాన్యం ఇచ్చారు. బాధ్యతాయుత సహజ వనరుల నిర్వహణ, పర్యావరణ సహకారాన్ని ప్రోత్సహించే అంశాలు ఇందులో ఉన్నాయి. వస్త్రాలు, తోలు, పాదరక్షలు, రత్నాలు–ఆభరణాలు, హస్తకళలు, ఆహార శుద్ధి, వాహన విడిభాగాలు, ప్లాస్టిక్‌, సేంద్రీయ రసాయనాల వంటి అధిక ఉపాధి కల్పించే రంగాల్లో ఎగుమతులు పెరుగుతాయని అంచనా. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

మహిళలు, యువత, సూక్ష్మ–చిన్న–మధ్యతరహా సంస్థలు, వ్యాపారులు, వృత్తి నిపుణులకు విస్తృత అవకాశాలు కల్పించడంపై ఒప్పందం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాణిజ్యం, ఆవిష్కరణలు, ఔత్సాహిక వ్యాపార రంగాల్లో మహిళలు, తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వర్గాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కార్మిక హక్కులు, లింగ సమానత్వం, న్యాయమైన పని పరిస్థితులకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.

చిన్న సంస్థలకు 4 నుంచి 16 శాతం వరకు సుంక భారం ఆదా

సరళీకృత కస్టమ్స్‌ విధానాలు, కాగితరహిత వాణిజ్యం, డిజిటల్‌ వ్యవస్థలతో చిన్న, మధ్యతరహా సంస్థల వ్యయభారం తగ్గనుంది. భారత ఎగుమతుల్లో 99 శాతం ఉత్పత్తులకు బ్రిటన్‌లో సుంక రహిత ప్రవేశం లభించడం వల్ల వస్త్రాలు, తోలు, ఆభరణాలు, పాదరక్షలు, ఆహార ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 4 నుంచి 16 శాతం వరకు సుంక భారం ఆదా అవుతుందని అంచనా. సింగిల్‌ విండో, అధీకృత ఆర్థిక కార్యకలాపాల వ్యవస్థల వంటి ఇప్పటికే ఉన్న విధానాలను మరింత సమర్థంగా వినియోగించనున్నారు. ఎలక్ట్రానిక్‌ ధ్రువీకరణ, డిజిటల్‌ వాణిజ్య సదుపాయాలతో వ్యాపార ప్రక్రియలు వేగవంతం కానున్నాయి.

పెట్టుబడుల్లోనూ బలమైన బంధం

భారత్‌లోకి పెట్టుబడులు పెట్టే దేశాల్లో బ్రిటన్‌ ఆరో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. 2024 సెప్టెంబర్‌ వరకు బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సమీకృత ఈక్విటీ పెట్టుబడులు 35 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2024 మార్చి వరకు బ్రిటన్‌లో భారత పెట్టుబడులు 19 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2025 జూలై నాటికి బ్రిటన్‌లో 971 భారత కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తూ లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. భారత్‌లో 667 బ్రిటిష్‌ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐదు లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

యువ నిపుణులకు రెండు దేశాల్లో అవకాశాలు

2021 మే 4న భారత్‌, బ్రిటన్‌ వలసలు–రాకపోకల భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఉద్యోగ, వృత్తి నిపుణుల వేగవంతమైన రాకపోకలకు అవకాశం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

2022 నవంబర్‌లో జీ20 బాలి సదస్సు సందర్భంగా యువ వృత్తి నిపుణుల పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ఏటా 3 వేల వీసాలు జారీ చేస్తున్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసున్న పట్టభద్రులకు రెండేళ్ల వీసా లభిస్తుంది. రెండు దేశాల యువత పరస్పరం ఆయా దేశాల్లో నివసిస్తూ పనిచేసే అవకాశం పొందుతున్నారు.

బ్రిటన్‌లో 18.64 లక్షల భారతీయులు

2021 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్‌లో 18.64 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఇది బ్రిటన్‌ జనాభాలో 2.6 శాతం. 2022లో బ్రిటన్‌ జనాభా సుమారు 6.8 కోట్లుగా అంచనా. బ్రిటన్‌లో 3.69 లక్షల మంది భారత పాస్‌పోర్టు కలిగినవారు నివసిస్తున్నట్లు జనాభా లెక్కలు వెల్లడించాయి.

ఉపాధి, వృత్తి విద్యలో భారత సంతతి ప్రజలు మెరుగైన స్థితిలో ఉన్నారు. విద్య, సాహిత్యం, కళలు, వైద్యం, విజ్ఞానశాస్త్రం, క్రీడలు, పరిశ్రమలు, వ్యాపారం, రాజకీయ రంగాల్లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 మార్చిలో విడుదలైన గ్రాంట్‌ థార్న్‌టన్‌, భారత వాణిజ్య–పరిశ్రమల సమాఖ్య నివేదిక ప్రకారం బ్రిటన్‌లో భారత సంతతి ప్రజలకు చెందిన 65 వేలకుపైగా కంపెనీలు ఉన్నాయి.

దేశీయ ప్రయోజనాలకు రక్షణ.. 89.5 శాతం సుంక శ్రేణులపై రాయితీలు

బ్రిటన్‌ ఎగుమతులకు సంబంధించి భారత్‌ 89.5 శాతం సుంక శ్రేణులపై రాయితీలు ఇచ్చింది. ఇవి బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చే ఎగుమతుల్లో 91 శాతం విలువను కవర్‌ చేస్తాయి. బ్రిటన్‌ ఎగుమతి విలువలో 24.5 శాతం ఉత్పత్తులకు తక్షణమే సుంక రహిత ప్రవేశం లభిస్తుంది. మిగతా ఉత్పత్తులపై రాయితీలను దశలవారీగా అమలు చేయనున్నారు. అయితే వ్యవసాయం, వ్యూహాత్మక పరిశ్రమల వంటి సున్నిత రంగాలను భారత్‌ రక్షించింది.

పాల ఉత్పత్తులు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, యాపిల్స్‌, వంటనూనెలు, ఓట్స్‌, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు రక్షణ కల్పించారు. బంగారం, ఆభరణాలు, ప్రయోగశాలలో తయారయ్యే వజ్రాలు, కొన్ని ముఖ్యమైన సుగంధ నూనెలు, కీలక ఇంధనాలు, సముద్ర నౌకలు, వాడిన దుస్తులు, కీలక పాలిమర్లు, వాటి మోనోఫిలమెంట్లు, స్మార్ట్‌ఫోన్లు, ఆప్టికల్‌ ఫైబర్లను కూడా సున్నిత ఉత్పత్తుల జాబితాలో చేర్చారు.

దేశీయ తయారీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల కింద సామర్థ్యాన్ని పెంచుకుంటున్న రంగాలకు ఐదు, ఏడు లేదా పదేళ్ల వ్యవధిలో దశలవారీగా సుంకాలను తగ్గించే విధానం అమలు కానుంది. మద్య పానీయాల మార్కెట్‌ను కూడా భారత్‌ ఎంపిక చేసిన ఉత్పత్తులకు మాత్రమే దశలవారీగా తెరవనుంది.

కార్లకు కోటా.. చిన్న కార్లు, చౌక విద్యుత్‌ వాహనాలకు రక్షణ

వాహన రంగంలో భారత్‌ అత్యంత జాగ్రత్తతో కోటా ఆధారిత, దశలవారీ మార్కెట్‌ సరళీకరణ విధానాన్ని ఎంచుకుంది. ఏటా 37 వేల పూర్తిగా తయారైన ప్రయాణికుల వాహనాలకు ప్రాధాన్య సుంకాల కింద ప్రవేశం కల్పించనున్నారు.

చిన్న, మధ్యస్థాయి అంతర్గత దహన ఇంజిన్‌ వాహనాలు, అందుబాటు ధరల్లోని విద్యుత్‌ వాహనాలకు రక్షణ కొనసాగుతుంది. విద్యుత్‌ వాహనాలపై రాయితీలు ఒప్పందం అమల్లోకి వచ్చిన ఆరో సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు భారత తయారీ సంస్థలు ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతికత, పోటీతత్వాన్ని పెంచుకునేందుకు సమయం లభిస్తుంది.

3 వేల సీసీలకు పైబడిన పెట్రోల్‌ ఇంజిన్‌, 2,500 సీసీలకు పైబడిన డీజిల్‌ ఇంజిన్‌ వాహనాలకు ఎక్కువ రాయితీలు లభిస్తాయి. కోటా పరిధిలోని వాహనాలపై సుంకం ఐదేళ్లలో 10 శాతానికి తగ్గనుండగా, కోటా వెలుపలి వాహనాలపై సుంకం పదేళ్లలో 50 శాతానికి తగ్గనుంది.

వస్త్ర రంగానికి 1,143 సుంక శ్రేణుల్లో సున్నా సుంకం

బ్రిటన్‌ ఏటా 28.8 బిలియన్‌ డాలర్ల విలువైన వస్త్రాలు, దుస్తులను దిగుమతి చేసుకుంటోంది. భారత ప్రపంచ వస్త్ర ఎగుమతులు సుమారు 37 బిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం భారత్‌ బ్రిటన్‌కు 1.79 బిలియన్‌ డాలర్ల వస్త్రాలను ఎగుమతి చేస్తూ 6.1 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. బ్రిటన్‌కు వస్త్రాలు సరఫరా చేసే దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.

ఒప్పందం కింద 1,143 సుంక శ్రేణుల్లో భారత వస్త్రాలకు సున్నా సుంక ప్రవేశం లభిస్తుంది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, కంబోడియాతో పోలిస్తే భారత ఉత్పత్తులు ఎదుర్కొంటున్న సుంక ప్రతికూలత తొలగిపోనుంది.

సిద్ధ దుస్తులు, గృహ వస్త్రాలు, తివాచీలు, హస్తకళా ఉత్పత్తులు ప్రధానంగా లాభపడనున్నాయి. మహిళల పత్తి దుస్తులు, పత్తి చొక్కాలు, బ్లౌజులు, టెర్రీ కాటన్‌ వంటగది–స్నానపు వస్త్రాలు, కృత్రిమ నార దుస్తులు, అల్లిన పత్తి దుస్తులు, పురుషుల పత్తి చొక్కాలు, టీ షర్టులు, బనియన్లు, పరుపులు, కుషన్లు, పడక సామగ్రి ఎగుమతులకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.

వ్యవసాయానికి 1,437 సుంక శ్రేణుల్లో సున్నా సుంకం

2020–21లో 41.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత వ్యవసాయ ఎగుమతులు 2022–23 నాటికి 45.05 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ 57 బిలియన్‌ డాలర్లకుపైగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. బ్రిటన్‌ ఏటా 90 బిలియన్‌ డాలర్లకుపైగా వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ భారత్‌ నుంచి కేవలం 1.11 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులనే కొనుగోలు చేస్తోంది. టీ, మామిడి, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులకు బ్రిటన్‌ అధిక విలువ కలిగిన మార్కెట్‌గా ఉంది.

ఒప్పందం కింద 1,437 సుంక శ్రేణుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు సున్నా సుంక మార్కెట్‌ ప్రవేశం లభిస్తుంది. మొత్తం ఒప్పంద సుంక శ్రేణుల్లో ఇవి 14.8 శాతం. ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవసాయ ఒప్పందం కింద రక్షణ చర్యలు అమలు చేసే హక్కును వినియోగించుకోబోమని బ్రిటన్‌ అంగీకరించింది.

బ్రిటన్‌ మార్కెట్‌లో భారత రైతులకు తమ ఉత్పత్తులకు అధిక ధరలు పొందే అవకాశం ఏర్పడనుంది. జన్యు వనరులకు సంబంధించిన పేటెంట్‌ ప్రక్రియలో సంప్రదాయ జ్ఞానాన్ని గుర్తించే అంశానికీ ప్రాధాన్యం లభించింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌, మహారాష్ట్రలోని ద్రాక్ష, ఉల్లి రైతులు, గుజరాత్‌లోని వేరుశనగ, పత్తి ఉత్పత్తిదారులు, కేరళ సుగంధ ద్రవ్యాల రైతులు, ఈశాన్య రాష్ట్రాల ఉద్యాన రైతులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా.

సున్నా సుంక ప్రవేశంతో వచ్చే మూడేళ్లలో వ్యవసాయ ఎగుమతులు 50 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా. తాజా ద్రాక్ష, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, బేకరీ ఉత్పత్తులు, నిల్వ చేసిన కూరగాయలు, పండ్లు, గింజలు, తాజా–చల్లబరిచిన కూరగాయలు, సాస్‌లు, సిద్ధం చేసిన సాస్‌ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రిటన్‌లో సున్నా సుంక ప్రయోజనం పొందుతున్న జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి ఐరోపా దేశాలతో భారత ఉత్పత్తులు సమానంగా పోటీ పడే అవకాశం లభిస్తుంది.

ఆహార శుద్ధి రంగానికి భారీ అవకాశం

భారత్‌ ప్రపంచవ్యాప్తంగా 14.07 బిలియన్‌ డాలర్ల విలువైన శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. బ్రిటన్‌ 50.68 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ భారత్‌ నుంచి కేవలం 309.5 మిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులనే కొనుగోలు చేస్తోంది. ఈ రంగంలో 985 సుంక శ్రేణులకు సున్నా సుంక ప్రవేశం కల్పించారు. ఇవి మొత్తం సుంక శ్రేణుల్లో 10.1 శాతం. ఆహార శుద్ధి సంస్థలు, ఎగుమతిదారులకు దీని ద్వారా భారీ అవకాశాలు లభించనున్నాయి.

భారత ఇన్‌స్టంట్‌ కాఫీకి బ్రిటన్‌ మార్కెట్‌

భారత కాఫీ ఎగుమతుల్లో 1.7 శాతం, టీ ఎగుమతుల్లో 5.6 శాతం, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో 2.9 శాతం బ్రిటన్‌ మార్కెట్‌కు వెళ్తున్నాయి. తక్షణ కాఫీ ఉత్పత్తులకు సుంక రహిత ప్రవేశం కల్పించడంతో భారత విలువ ఆధారిత కాఫీ ఉత్పత్తుల పోటీతత్వం పెరగనుంది. జర్మనీ, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ నుంచి వచ్చే తక్షణ కాఫీ ఉత్పత్తులతో భారత కంపెనీలు మరింత సమర్థంగా పోటీ పడే అవకాశం ఉంది.

తోలు, పాదరక్షల ఎగుమతులు 900 మిలియన్‌ డాలర్లు దాటే అవకాశం

2024లో భారత్‌ నుంచి బ్రిటన్‌కు తోలు, పాదరక్షల ఎగుమతులు 494 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. బ్రిటన్‌ తోలు, పాదరక్షల మార్కెట్‌ పరిమాణం 8.9 బిలియన్‌ డాలర్లు. భారత ప్రపంచ ఎగుమతులు 5.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. పాదరక్షలకు సుంక రహిత ప్రవేశం లభించడంతో ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని తోలు, పాదరక్షల పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుంది.

రబ్బరు లేదా ప్లాస్టిక్‌ అడుగుభాగం కలిగిన తోలు పాదరక్షలు, తోలు బూట్లు, వస్త్రంతో తయారైన క్రీడా–సాధారణ పాదరక్షలు, లోహ రక్షణ కలిగిన భద్రతా బూట్లు, హ్యాండ్‌బ్యాగులు, పర్సుల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. బ్రిటన్‌కు భారత తోలు, పాదరక్షల ఎగుమతులు 900 మిలియన్‌ డాలర్లను దాటవచ్చని అంచనా. వియత్నాం, ఇండోనేషియా, కంబోడియా, టర్కీ, బంగ్లాదేశ్‌తో పోటీలో భారత్‌కు అనుకూలత లభిస్తుంది. గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ మత్స్యరంగానికి కీలక ప్రయోజనం

బ్రిటన్‌ ఏటా 4.9 బిలియన్‌ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో భారత్‌ వాటా కేవలం 126 మిలియన్‌ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 7.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. బ్రిటన్‌ మార్కెట్‌లో భారత గడ్డకట్టించిన సముద్ర ఆహార ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. చేపలు, రొయ్యలు, కటిల్‌ఫిష్‌ ప్రధాన ఎగుమతి ఉత్పత్తులుగా ఉన్నాయి. బ్రిటన్‌లోని భారీ భారత సంతతి జనాభాతో పాటు శుద్ధి చేసిన సముద్ర ఆహార వినియోగం పెరగడం కూడా డిమాండ్‌కు కారణం.

భారత సముద్ర ఉత్పత్తులపై బ్రిటన్‌ సుంకాలను పూర్తిగా తొలగించనుంది. గతంలో భారత రొయ్యలపై 4.2 నుంచి 8.5 శాతం వరకు సుంకం ఉండేది. ఈ సుంకం తొలగింపుతో ఎగుమతిదారులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు మత్స్య విలువ గొలుసులో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సముద్ర ఆహార ఎగుమతిదారులు, శుద్ధి కేంద్రాలు, తీర ప్రాంత మత్స్యకారులు, మత్స్య పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుంది. ఎగుమతి డిమాండ్‌ పెరిగితే కొనుగోలు ధరలు మెరుగుపడి మత్స్యకారుల జీవనోపాధి బలపడే అవకాశం ఉంది.

సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రకారం సముద్ర ఆహార శుద్ధి కేంద్రాల్లో వేలాది మంది మహిళలు పనిచేస్తున్నారు. బ్రిటన్‌ మార్కెట్‌ అవకాశాలు పెరిగితే ఈ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్య వినియోగం పెరుగుతుంది. కేరళ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ఎగుమతులు, ఉపాధి, తీర ప్రాంత ఆర్థికాభివృద్ధి పరంగా గణనీయ ప్రయోజనం కలుగుతుందని అంచనా.

ఇంజినీరింగ్‌ ఎగుమతులు 7.5 బిలియన్‌ డాలర్లు దాటే అంచనా

భారత ఇంజినీరింగ్‌ ఉత్పత్తులకు బ్రిటన్‌ ఆరో అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌. 2024–25లో బ్రిటన్‌కు భారత ఇంజినీరింగ్‌ ఎగుమతులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.7 శాతం పెరిగాయి. బ్రిటన్‌ ఏటా 193.52 బిలియన్‌ డాలర్ల ఇంజినీరింగ్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ భారత్‌ నుంచి కేవలం 4.28 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులనే కొనుగోలు చేస్తోంది.

ఒప్పందం కింద 1,659 సుంక శ్రేణుల్లో సున్నా సుంక ప్రవేశం లభిస్తుంది. మొత్తం సుంక శ్రేణుల్లో ఇది 17 శాతం. ప్రస్తుతం ఉన్న 18 శాతం వరకు సుంకాలు తొలగిపోనున్నాయి. విద్యుత్‌ యంత్రాలు, వాహన విడిభాగాలు, పారిశ్రామిక పరికరాలు, నిర్మాణ యంత్రాల తయారీ సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది.

తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణలోని పారిశ్రామిక సముదాయాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. 2029–30 నాటికి బ్రిటన్‌కు భారత ఇంజినీరింగ్‌ ఎగుమతులు రెట్టింపై 7.5 బిలియన్‌ డాలర్లను దాటవచ్చని అంచనా. కీలక ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు ఏటా 12 నుంచి 20 శాతం సమ్మిళిత వృద్ధి సాధించే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు ఊతం

అర్హత కలిగిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు సున్నా సుంక ప్రవేశం లభించనుంది. సాఫ్ట్‌వేర్‌, సమాచార సాంకేతిక ఆధారిత సేవలకు బ్రిటన్‌ మార్కెట్‌లో విస్తృత అవకాశాలు కల్పించే హామీలు ఒప్పందంలో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు, ఇన్వర్టర్ల ఎగుమతులు వేగంగా పెరిగే అవకాశం ఉంది. భారత సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఎగుమతులు ఏటా 15 నుంచి 20 శాతం పెరగవచ్చని అంచనా.

ఔషధాలు, వైద్య పరికరాలకు సున్నా సుంక ప్రయోజనం

బ్రిటన్‌ ఏటా దాదాపు 30 బిలియన్‌ డాలర్ల ఔషధాలను దిగుమతి చేసుకుంటోంది. అయితే భారత్‌ నుంచి దిగుమతులు ఒక బిలియన్‌ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి. ఔషధ రంగంలో 56 సుంక శ్రేణులకు సున్నా సుంక ప్రవేశం లభిస్తుంది. మొత్తం సుంక శ్రేణుల్లో ఇవి 0.6 శాతం. శస్త్రచికిత్స పరికరాలు, రోగ నిర్ధారణ పరికరాలు, గుండె విద్యుత్‌ తరంగాల పరీక్ష యంత్రాలు, ఎక్స్‌రే వ్యవస్థలు సహా అనేక వైద్య పరికరాలపై సుంకాలు తొలగిపోనున్నాయి.

భారత వైద్య సాంకేతిక సంస్థలు, తయారీదారులకు ప్రయోజనం కలుగుతుంది. భారత సాధారణ ఔషధాల పోటీతత్వం బ్రిటన్‌ మార్కెట్‌లో పెరుగుతుందని అంచనా. బ్రెగ్జిట్‌, కరోనా అనంతరం చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని బ్రిటన్‌ తగ్గిస్తున్న నేపథ్యంలో భారత తయారీదారులు తక్కువ ధరలో నమ్మకమైన సరఫరాదారులుగా ఎదిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

రసాయన రంగంలో 1,206 సుంక శ్రేణులకు రాయితీ

భారత్‌ ప్రపంచవ్యాప్తంగా 40 బిలియన్‌ డాలర్ల రసాయన, అనుబంధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. బ్రిటన్‌ రసాయన మార్కెట్‌ విలువ 35.8 బిలియన్‌ డాలర్లు. భారత్‌ నుంచి బ్రిటన్‌కు రసాయన ఎగుమతుల వాటా ఇప్పటికీ పరిమితంగానే ఉంది. ఒప్పందం కింద 1,206 సుంక శ్రేణుల్లో సున్నా సుంక ప్రవేశం కల్పించారు. ఇవి మొత్తం సుంక శ్రేణుల్లో 12.4 శాతం. ఎరువులు, పారిశ్రామిక రసాయనాలు, పెట్రో రసాయన ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి. గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణలోని రసాయన తయారీ కేంద్రాలకు ప్రయోజనం కలుగుతుంది.

ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు ధరల పోటీలో బలం

బ్రిటన్‌కు ప్లాస్టిక్‌ ఉత్పత్తులు సరఫరా చేసే దేశాల్లో భారత్‌ 13వ స్థానంలో ఉంది. భారత తయారీ సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు సుంక రహిత ప్రవేశం లభిస్తుంది. దీంతో బ్రిటన్‌ మార్కెట్‌కు చేరే భారత ఉత్పత్తుల మొత్తం వ్యయం తగ్గి పోటీతత్వం పెరుగుతుంది. ప్లాస్టిక్‌ ఫిల్ములు, షీట్లు, పైపులు, ప్యాకేజింగ్‌ ఉత్పత్తులు, టేబుల్‌వేర్‌, వంటగది సామగ్రి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. జర్మనీ, చైనా వంటి ప్రధాన సరఫరాదారులతో భారత కంపెనీలు మరింత సమర్థంగా పోటీ పడగలవని అంచనా.

క్రీడా సామగ్రి, బొమ్మల ఎగుమతులకు కొత్త దారి

అర్హత కలిగిన భారత క్రీడా సామగ్రి, బొమ్మలపై బ్రిటన్‌ దిగుమతి సుంకాలను తొలగించనుంది. బ్రిటన్‌, ఐరోపా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం ద్వారా కొనుగోలుదారుల విశ్వాసం పెంచే అంశాలకు ఒప్పందంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఫుట్‌బాల్‌ బంతులు, క్రికెట్‌ సామగ్రి, రగ్బీ బంతులు, ఎలక్ట్రానిక్‌ కాని బొమ్మల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ రంగం 15 శాతం వృద్ధి సాధించి 2030 నాటికి ఎగుమతులు 186.97 మిలియన్‌ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యం ఉంది. బ్రిటన్‌తో ఇలాంటి వాణిజ్య ఒప్పందం లేని చైనా, వియత్నాం సరఫరాదారులతో పోలిస్తే భారత ఉత్పత్తులకు ధరల పరంగా ప్రయోజనం లభించనుంది.

రత్నాలు–ఆభరణాల ఎగుమతులు రెట్టింపు?

ప్రస్తుతం భారత్‌ నుంచి బ్రిటన్‌కు రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 1.03 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. బ్రిటన్‌ ఏటా సుమారు 4 బిలియన్‌ డాలర్ల విలువైన ఆభరణాలను దిగుమతి చేసుకుంటోంది. సుంక రాయితీలతో భారత తయారీదారులు, సంప్రదాయ కళాకారులకు ప్రయోజనం కలుగుతుంది. సూరత్‌, అహ్మదాబాద్‌, ముంబయి, జైపూర్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, చెన్నై, త్రిసూర్‌లోని రత్నాలు–ఆభరణాల తయారీ కేంద్రాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వచ్చే రెండు నుంచి మూడేళ్లలో బ్రిటన్‌కు భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతులు రెట్టింపు కావచ్చని అంచనా. డిజైన్‌, తయారీ, కళాకారుల రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఉక్కు ఎగుమతులకు ప్రత్యేక రక్షణ చర్యలు

2026 మార్చిలో బ్రిటన్‌ 188 సుంక శ్రేణులపై కొత్త ఉక్కు రక్షణ చర్యలను ప్రకటించింది. అవి జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సుంక శ్రేణుల్లో భారత ఎగుమతులు సుమారు 137 మిలియన్‌ డాలర్లు మాత్రమే. మొత్తం 960 మిలియన్‌ డాలర్ల భారత ఉక్కు ఎగుమతుల్లో ఇవి దాదాపు 14 శాతం. భారత ఉక్కు ఎగుమతిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు రెండు దేశాలు విస్తృత చర్చలు జరిపాయి. మార్కెట్‌లో అంతరాయాలను తగ్గిస్తూ సమతుల్య వాణిజ్య వాతావరణాన్ని కొనసాగించేందుకు మూడు కీలక ఉత్పత్తి విభాగాల్లో సుంక రహిత అవకాశాలను బ్రిటన్‌ విస్తరించింది.

మిశ్రమం కాని, ఇతర మిశ్రమ హాట్‌ రోల్డ్‌ షీట్లు, స్ట్రిప్స్‌ విభాగంలో భారత్‌కు ప్రత్యేక కోటాను 12,405 టన్నుల నుంచి 33,456 టన్నులకు దాదాపు మూడు రెట్లు పెంచారు. అధీకృత వినియోగ పథకం కింద కోటాలో 40 శాతాన్ని భారత్‌కు ప్రత్యేకంగా కేటాయించారు. దీని ద్వారా సుమారు 9.45 లక్షల టన్నుల ప్రత్యేక వాణిజ్య పరిమాణ ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు.

మిశ్రమం కాని వైర్‌ విభాగంలో తొమ్మిది వస్తు సంకేతాలను రక్షణ చర్యల పరిధి నుంచి తొలగించారు. దీంతో ఈ విభాగంలో భారత ఎగుమతుల్లో 95 శాతం ఎలాంటి పరిమితులు లేకుండా కొనసాగనున్నాయి. మిశ్రమం కాని వ్యాపార బార్లు, తేలికపాటి విభాగాల అవశేష కోటాను 468 టన్నుల నుంచి 4,540 టన్నులకు పెంచారు. ఇతర వెల్డెడ్‌ ట్యూబుల కోటాను 10,809 టన్నుల నుంచి 16,327 టన్నులకు పెంచారు. కొత్త వ్యవస్థ కింద భారత్‌కు దేశ ప్రత్యేక మొత్తం కోటా 1,68,029 టన్నులకు పెరిగింది. దీనికి అదనంగా అధీకృత వినియోగ పథకం కింద 9.45 లక్షల టన్నుల ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వ పత్రం పేర్కొంది.

నూనెగింజల ఎగుమతిదారులకూ అవకాశం

భారత నూనెగింజల ఉత్పత్తులకు తగ్గించిన సుంకాలు, సరళీకృత వాణిజ్య ప్రక్రియలు అమలు కానున్నాయి. దీంతో భారత నూనెగింజల ఎగుమతిదారులు బ్రిటన్‌లో వినియోగదారుల పరిధిని విస్తరించుకోవడంతో పాటు మార్కెట్‌ వాటాను పెంచుకునే అవకాశం పొందనున్నారు.

సేవల రంగంలో 137 ఉపరంగాలకు అవకాశాలు

భారత్‌–బ్రిటన్‌ ఆర్థిక భాగస్వామ్యంలో సేవల రంగం కీలక స్తంభంగా ఉంది. బ్రిటన్‌తో సేవల వాణిజ్యంలో భారత్‌కు సుమారు 7.9 బిలియన్‌ డాలర్ల మిగులు ఉంది. భారత సేవల ఎగుమతులు 21.6 బిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతులు 13.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. బ్రిటన్‌ నుంచి మొత్తం 12 ప్రధాన సేవల రంగాలు, 137 ఉపరంగాలకు సంబంధించిన విస్తృత హామీలను భారత్‌ పొందింది. ఇవి భారత సేవల ఎగుమతి ప్రయోజనాల్లో 99 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తాయి. భారత్‌ తనవైపు నుంచి 108 ఉపరంగాల్లో హామీలు ఇచ్చింది.

నర్సింగ్‌, అకౌంటెన్సీ, ఆర్కిటెక్చర్‌ అర్హతల గుర్తింపుపై చర్చలు

ఒప్పందం అమల్లోకి వచ్చిన 12 నెలల్లో వృత్తిపరమైన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాలపై ముందుకు సాగేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. నర్సింగ్‌, అకౌంటెన్సీ, ఆర్కిటెక్చర్‌ రంగాలను ఇందులో ప్రతిపాదించారు. వృత్తి నిపుణులు ఎదుర్కొంటున్న అడ్డంకులను తగ్గించడం, రెండు దేశాల మధ్య ఉత్తమ విధానాల మార్పిడిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. భారత నిపుణులపై సంఖ్యాపరమైన పరిమితులు లేదా ఆర్థిక అవసరాల పరీక్షను విధించబోమని బ్రిటన్‌ అంగీకరించింది. ఆర్థిక అవసరాల పరీక్ష తొలగింపుతో భారత వృత్తి నిపుణుల రాకపోకల్లో అనిశ్చితి తగ్గుతుందని అంచనా. భారత సాంస్కృతిక నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఒప్పంద సేవల సరఫరాదారులకు ఏటా 1,800 ప్రత్యేక స్థానాల కోటాను కేటాయించారు.

ఎవరు ఎంతకాలం బ్రిటన్‌లో ఉండొచ్చు?

వ్యాపార సందర్శకులు అన్ని రంగాల్లో ఆరు నెలల వ్యవధిలో 90 రోజుల వరకు ఉండవచ్చు. కంపెనీల అంతర్గత బదిలీలపై వెళ్లే ఉద్యోగులు అన్ని రంగాల్లో మూడేళ్ల వరకు ఉండవచ్చు. భాగస్వాములు, ఆధారిత కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఉంటుంది. పట్టభద్ర శిక్షణార్థులు ఈ విభాగంలోకి వస్తారు. పెట్టుబడిదారులు ఏడాది వరకు ఉండవచ్చు. ఒప్పంద సేవల సరఫరాదారులు 24 నెలల వ్యవధిలో 12 నెలల వరకు బ్రిటన్‌లో ఉండవచ్చు. సమాచార సాంకేతిక సేవలు, వ్యాపారం, ఆర్థిక సేవలు, ఆతిథ్యం, రవాణా సహా 33 ఉపరంగాలకు ఇది వర్తిస్తుంది. స్వతంత్ర వృత్తి నిపుణులు 24 నెలల వ్యవధిలో 12 నెలల వరకు ఉండవచ్చు. సమాచార సాంకేతిక సేవలు, వ్యాపారం, వృత్తిపరమైన సేవలు, టెలికమ్యూనికేషన్లు, ఆర్థిక రంగం సహా 16 ఉపరంగాలకు ఈ అవకాశం ఉంటుంది.

75 వేల భారత నిపుణులకు భారీ ఊరట

ఇప్పటివరకు స్వల్పకాలిక ఉద్యోగ బాధ్యతలపై బ్రిటన్‌కు వెళ్లే భారత నిపుణులు, వారి యజమానులు వేతనంలో దాదాపు 23 శాతాన్ని బ్రిటన్‌ జాతీయ బీమా వ్యవస్థకు చెల్లించాల్సి వచ్చేది. అయితే వారికి దానికి తగిన ప్రయోజనాలు లభించేవి కావు. ద్వంద్వ చెల్లింపుల ఒప్పందం కింద 60 నెలల వరకు ఉండే ఉద్యోగ నియామకాలకు ఈ ద్వంద్వ సామాజిక భద్రత చెల్లింపులను తొలగించనున్నారు.

దీంతో 75 వేలకుపైగా భారత వృత్తి నిపుణులు, సుమారు 900 భారత కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. కంపెనీల ఉద్యోగ వ్యయం తగ్గడంతో పాటు ఉద్యోగుల చేతికి వచ్చే వేతనం పెరుగుతుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రస్తుతం ఈ అంశంలో ఏటా 600 మిలియన్‌ డాలర్లకుపైగా ఆదా అయ్యే అవకాశం ఉంది.

డిజిటల్‌ సేవలకు మరింత విస్తృత మార్కెట్‌

సమాచార సాంకేతికత, వృత్తిపరమైన సలహా సేవలు, విద్య, శిక్షణ, టెలికమ్యూనికేషన్‌ వంటి డిజిటల్‌ మార్గంలో అందించే సేవలకు బ్రిటన్‌ మార్కెట్‌లో అవకాశాలు పెరగనున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌తో వాణిజ్య మిగులు సాధిస్తున్న భారత సమాచార సాంకేతిక, అనుబంధ సేవల రంగానికి ఇది మరింత ఊతమివ్వనుంది. భారత కంపెనీలు బ్రిటన్‌లో నిర్వహణ సలహా, విద్య, పర్యావరణ సేవల రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

అంకుర సంస్థల నుంచి ప్రపంచ సామర్థ్య కేంద్రాల వరకు..

బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న భారత వ్యాపారులకు సేవల రంగ హామీలు మరింత స్పష్టత ఇస్తాయి. నిబంధనల భారాన్ని తగ్గించడం ద్వారా ముఖ్యంగా డిజిటల్‌ సేవల రంగంలోని భారత అంకుర సంస్థలు కొత్త వినియోగదారులను చేరుకునే అవకాశం పొందుతాయి.

భారత సమాచార సాంకేతిక నిపుణులు బ్రిటన్‌లో పనిచేయడం మరింత సులభం, తక్కువ వ్యయంతో కూడిన ప్రక్రియగా మారే అవకాశం ఉంది. ప్రతిభావంతులైన ఉద్యోగుల రాకపోకలు వేగవంతం కానున్నాయి.

ప్రపంచ సామర్థ్య కేంద్రాల విషయంలోనూ ఈ ఒప్పందం కీలక మార్పుకు దారి తీసే అవకాశం ఉంది. భారత్‌ను కేవలం తక్కువ వ్యయంతో పనిచేసే వెనుక కార్యాలయ కేంద్రంగా కాకుండా పరిశోధన–అభివృద్ధి, విశ్లేషణ, సైబర్‌ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామిగా బ్రిటన్‌ కంపెనీలు చూసే పరిస్థితి ఏర్పడవచ్చని అంచనా.

ఆరోగ్యం, విద్యా రంగాల్లో పరస్పర అవకాశాలు

భారత ఆసుపత్రులు బ్రిటన్‌ సంస్థలతో కలిసి మెరుగైన వైద్య సేవలు అందించడం, ఆధునిక వైద్య సాంకేతికతలను స్వీకరించే అవకాశాలు పెరగనున్నాయి. బ్రిటన్‌ విద్యా సంస్థలు భారత్‌లో ప్రాంగణాలను ఏర్పాటు చేయవచ్చు. భారత విద్యా సంస్థలు బ్రిటన్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. విద్యా సాంకేతిక రంగంలోనూ విస్తరణకు కొత్త దారులు తెరుచుకోనున్నాయి.

భారత ఆర్థిక సంస్థలకు బ్రిటన్‌లో మెరుగైన ప్రవేశం

భారత ఆర్థిక సంస్థలకు బ్రిటన్‌ మార్కెట్‌లో మెరుగైన అవకాశాలు లభించనున్నాయి. అక్కడి భారత సంతతి ప్రజలు, భారత వ్యాపారాలకు సేవలు అందించే సామర్థ్యం పెరుగుతుంది. వివక్ష రహిత నిబంధనలు భారత సంస్థలకు సమాన అవకాశాలను హామీ ఇస్తాయి. ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు, ఆర్థిక సాంకేతికత, ఇతర డిజిటల్‌ ఆర్థిక పరిష్కారాల విస్తరణకు కూడా ఒప్పందం ఊతమివ్వనుంది.

భారత సరఫరాదారులకు 90 బిలియన్‌ పౌండ్లు, అంటే సుమారు 122 బిలియన్‌ డాలర్ల విలువైన బ్రిటన్‌ ప్రభుత్వ కొనుగోళ్ల మార్కెట్‌లో ప్రవేశం లభించనుంది. ప్రతిగా బ్రిటన్‌ కంపెనీలకు భారత్‌లోని 114 బిలియన్‌ డాలర్ల ప్రభుత్వ కొనుగోళ్ల మార్కెట్‌లో అవకాశాలు లభిస్తాయి. భారత సరఫరాదారులకు సమాన అవకాశాలు కల్పించే నిబంధనలు అమలు కానున్నాయి. సమాచార సాంకేతికత, నిర్మాణం, ఆర్థిక సేవలు, బీమా, ఎంపిక చేసిన విద్యా సంస్థలకు సంబంధించిన రంగాల్లో అవకాశాలు ఏర్పడనున్నాయి.

సమాచార సాంకేతిక, వ్యాపార సేవల వృద్ధిని ఈ ఒప్పందం మరింత వేగవంతం చేస్తుందని అంచనా. బ్రిటన్‌ ఏటా సుమారు 200 బిలియన్‌ డాలర్ల విలువైన సేవలను దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం భారత్‌ నుంచి సుమారు 14 బిలియన్‌ డాలర్ల సేవలు అక్కడికి వెళ్తున్నాయి. కొత్త మార్కెట్‌ అవకాశాలు, వృత్తి నిపుణుల రాకపోకలకు స్పష్టమైన నిబంధనలు, డిజిటల్‌ సేవలకు ప్రోత్సాహం, పెట్టుబడి అవకాశాలతో బ్రిటన్‌ సేవల మార్కెట్‌లో భారత కంపెనీలు తమ వాటాను మరింత పెంచుకునే అవకాశం ఉంది.

వాణిజ్య ఒప్పందాన్ని మించి.. భవిష్యత్‌ భాగస్వామ్యానికి పునాది

భారత్‌–బ్రిటన్‌ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం కేవలం దిగుమతులు, ఎగుమతులపై సుంకాలు తగ్గించే ఒప్పందంగా మాత్రమే పరిమితం కావడం లేదు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, డిజిటల్‌ వాణిజ్యం, సేవలు, వృత్తి నిపుణుల రాకపోకలు, మహిళలు–యువత భాగస్వామ్యం, చిన్న పరిశ్రమల విస్తరణ, సుస్థిర అభివృద్ధి వంటి అనేక రంగాలను కలుపుతూ విస్తృత ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తోంది.

ఒకవైపు బ్రిటన్‌ మార్కెట్‌లో భారత ఉత్పత్తులు, సేవలకు విస్తృత అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు దేశీయంగా సున్నితమైన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను రక్షించే విధంగా భారత్‌ దశలవారీ మార్కెట్‌ సరళీకరణ విధానాన్ని ఎంచుకుంది.

రైతులు, మత్స్యకారులు, మహిళా కార్మికులు, కళాకారులు, చిన్న వ్యాపారులు, తయారీ సంస్థలు, అంకుర సంస్థలు, సమాచార సాంకేతిక నిపుణులు, వైద్య–విద్యా సంస్థలు, ఆర్థిక సేవల కంపెనీల వరకు విస్తృత వర్గాలకు కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.