పంట అవశేషాలు కాల్చితే జరిమానా: ఏఓ కొండల సుష్మ

పంట అవశేషాలు కాల్చితే జరిమానా: ఏఓ కొండల సుష్మ
అచ్చలాపూర్, తాండూర్‌లో వరి పంట క్షేత్ర ప్రదర్శన
అవశేషాలు కాల్చడం జీఓ 27 ప్రకారం నిషేధం
బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ):* వరి, మొక్కజొన్న, పత్తి పంటల కోతల అనంతరం మిగిలే పంట అవశేషాలను పొలాల్లో కాల్చడం పూర్తిగా నిషేధించబడిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని తాండూరు మండల వ్యవసాయ అధికారి (ఏవో) కొండల సుష్మ హెచ్చరించారు. బుధవారం మండలంలోని అచ్చలాపూర్, తాండూరు గ్రామాల్లో నిర్వహించిన వరి పంట క్షేత్ర ప్రదర్శనలో ఆమె పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఓ సుష్మ మాట్లాడుతూ.. పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా గాలి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా మంటల వేడికి నేలలోని సేంద్రియ పదార్థాలు, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని వివరించారు. దీనివల్ల నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు పూర్తిగా నశిస్తాయన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం విడుదలైన జీఓ నెం.27 (తేదీ: 10.07.2017) ప్రకారం పంట అవశేషాలను బహిరంగంగా కాల్చడం చట్టరీత్యా నేరమని, ఏ రైతు అయినా చిన్న లేదా భారీ స్థాయిలో నిప్పు పెడితే చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా తప్పదని స్పష్టం చేశారు.
పంట అవశేషాలను కాల్చకుండా రోటవేటర్లతో భూమిలోనే కలియదున్నడం వల్ల అవి కుళ్లి మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయన్నారు. దీనివల్ల నేలలో సేంద్రియ కర్బనం శాతం పెరిగి సుస్థిర వ్యవసాయానికి బాటలు పడుతుందని, రైతులంతా దీన్ని బాధ్యతగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈవో వి.వి. ధనలక్ష్మి (రేచిని క్లస్టర్), ఎం. వెంకటేష్ (తాండూరు క్లస్టర్) స్థానిక రైతులు పాల్గొన్నారు.
