తాగునీటి సమస్యతో కొత్తపల్లి గ్రామస్తుల అల్లాడింపు

తాగునీటి సమస్యతో కొత్తపల్లి గ్రామస్తుల అల్లాడింపు
-ఎడ్లబండ్లపై నీటి తరలింపు
కన్నెపల్లి, ఆంధ్రప్రభ:
కన్నెపల్లి మండలం జజ్జరెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఎస్టీ, బీసీ వీధుల ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్వెల్ మంజూరైనా ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు.
గ్రామంలో సుమారు 1300 జనాభా ఉండగా ఎస్టీలు దాదాపు 60 మంది, బీసీలు 200 మంది, ఎస్సీలు వెయ్యి మంది నివసిస్తున్నారు. ఎస్సీ కాలనీలో రెండు బోర్లు ఉన్నప్పటికీ, బీసీ, ఎస్టీ వీధుల్లో తాగునీటి బోరు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బోరు ఆరు నెలల క్రితం చెడిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు సరఫరా అవుతున్నప్పటికీ, వారానికి ఒక్కసారి మాత్రమే నీటి సరఫరా జరగడం, అలాగే ఎత్తైన ప్రాంతాల్లోని కాలనీలకు నీరు చేరకపోవడం సమస్యగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి కూడా నీరు సరిపోవడం లేదని, నిత్య అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో గ్రామస్తులు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోని నెన్నెల మండలంలోని ఎర్రవాగు ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి ఎడ్లబండ్ల ద్వారా తాగునీరు తెచ్చుకుంటున్న దుస్థితి నెలకొంది.
గత ఏడాది ఎస్టీ వీధిలో విద్యుత్ మోటార్‌తో కూడిన బోరు మంజూరైనా, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
మరోవైపు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ అది సరిపోకపోవడంతో అదనపు ట్యాంక్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మంజూరైన బోరును ఎస్టీ, బీసీ కాలనీలకు సమీపంలో వేయిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

